చిత్తూరు : చిత్తూరు పార్లమెంటు సీటు మరోసారి శివప్రసాద్ కు దక్కేనా ? ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన, ముచ్చటగా మూడోసారి బరిలో నిలవనున్నారా ? అల్లుడికి అసెంబ్లీ టికెట్ ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు.. మరి మామను కూడా కరుణిస్తారా ? చిత్తూరు పార్లమెంట్ సీటుకు ఇప్పటికే ఓ ప్రొఫెసర్ ఖరారయ్యారన్న ప్రచారంలో వాస్తవమెంత?
చిత్తూరు పార్లమెంటు స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1996 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఆరు సార్లు టిడిపి అభ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. రిజర్వు నియోజకవర్గంగా మారిన తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఇక్కడి నుంచి డాక్టర్ శివప్రసాద్ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లోనూ శివ ప్రసాద్ టిడిపి టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. ఈ దఫా చిత్తూరు పార్లమెంట్ సీటు శివప్రసాద్ కు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివప్రసాద్ చిన్నల్లుడు నరసింహ ప్రసాద్‌కు కడప జిల్లా రైల్వేకోడూరు టిడిపి టికెట్ దక్కింది. అల్లుడికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు మరి మామ శివప్రసాద్ కు టికెట్ ఇస్తారా అన్న సందేహాలు జిల్లా అంతటా వ్యక్తమవుతున్నాయి.
గతేడాది చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ప్రభుత్వంలో దళితులకు సరైన గుర్తింపు లభించడంలేదని శివ ప్రసాద్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకు సైతం ఆగ్రహం తెప్పించాయి. తదనంతర పరిణామాలతో వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోయినా… ఆ వ్యాఖ్యల తాలూకు దుమారం శివప్రసాద్ ను ఇంకా వెంటాడుతోంది. పైపెచ్చు శివ ప్రసాద్‌ను ఆరోగ్య సమస్యలు కూడా భాదిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి శివప్రసాద్ కు టిక్కెట్ దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గడిచిన రెండు టర్మ్ లలో ఎంపీగా శివప్రసాద్ చురుగ్గా పని చేశారనే చెప్పాలి. ప్రత్యేకించి రాష్ట్ర విభజన సమయంలో… తర్వాత రాష్ట్ర హక్కుల కోసం మోడీ పై తిరుగుబాటు అంశాలలోనూ శివ ప్రసాద్ దృఢవైఖరి ప్రదర్శించారు. పార్లమెంటు వద్ద వినూత్న వేషాలతో నిరసన తెలుపుతూ జాతీయ మీడియాను సైతం శివప్రసాద్ ఆకర్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శివప్రసాద్ కు టికెట్ నిరాకరించే ధైర్యం చేస్తారా… అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు పార్లమెంట్ టిక్కెట్ రేసులో ప్రొఫెసర్ ఆవుల దామోదరం పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రొఫెసర్ దామోదర్ చిత్తూరు జిల్లా వాసి. బంగారుపాలెం మండలంకు చెందిన ప్రొఫెసర్ దామోదరం ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా చెబుతారు. ఎస్వీయు విసి పదవీ కాలం ముగిశాక ప్రొఫెసర్ దామోదర్ కి సీఎం చంద్రబాబు నాయుడు తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబు నాయుడు కోర్ టీమ్ లో పనిచేస్తున్నారు. దామోదరం చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా గెలుపు ఖరారుగా టిడిపి భావించే చిత్తూరు పార్లమెంట్ సీటు ఆ పార్టీలో ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.