2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కడప జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. నాలుగేళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన ఇటీవల వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గంలో మేడా రాకతో సమీకరణాలు మారిపోతాయని ప్రతీ ఒక్కరూ భావించారు. ఇప్పటికే నియోజకవర్గంలో కడప జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పనిచేసుకుంటుండగా.. మొదటి నుండి తనకే సీటని అందరూ భావించారు. అయితే మేడా రాకతో ఆయనకు సీటు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ.. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తనకు టిక్కెట్ రాకపోయినా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
ఈ సంధర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రజల కోసం ప్రవేశపెడితే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని, ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలలోకి తీసుకుని వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయి మేడా మల్లికార్జునరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా మీకు ఏ సమస్య వచ్చినా తనకు చెబితే అది పరిష్కరించేందుకు ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రాజేంద్రనాధరెడ్డి, ఆంజనేయులు, సుబ్బరామరాజు, లక్షుమయ్య, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.