Ys Sharmila
YS Sharmila : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ వ్యవహారంలో ఆమె మరోసారి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము పోరాడతామని చెప్పారు. రాష్ట్రం కోసం, నీటి కోసం ఎవరినైనా ఎదిరించేందుకు నేను సిద్ధమే అని షర్మిల అన్నారు. అంతేకాదు తెలంగాణకు ఒక్క నీటి చుక్క అన్యాయం జరిగినా సహించబోమని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నీటి కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తెలంగాణ మంత్రులు ఏపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ మంత్రులు సైతం అంతే ధీటుగా స్పందిస్తున్నారు. ఎదురు దాడికి దిగారు. నీటి విషయం ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు మద్దతుగా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పొలిటికల్ హీట్ ని మరింత పెంచాయి.
తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపించబోతున్నట్టు షర్మిల తెలిపారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడటానికి నాలుగు స్తంభాలు చాలా ముఖ్యమని… అవి కూడా చేయలేనిది చేసేదే ఫిఫ్త్ ఎస్టేట్ అని… అదే సోషల్ మీడియా అని చెప్పారు. నెటిజన్ల మద్దతు లేకుండా తాను ఏమీ చేయలేనని అన్నారు.
జులై 8న తమ పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల చెప్పారు. చివరికి టీడీపీ నేత రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిని చేసిందని, అదీ కాంగ్రెస్ దుస్థితి అని షర్మిల ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు సోషల్ మీడియా ఉద్యోగులు ఉన్నారన్న షర్మిల.. కానీ, తమకు ఆ అవసరం లేదని, వైయస్సార్ అభిమానులే తమ సైన్యమని చెప్పారు. పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అన్ని విషయాలను లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా కార్యకర్తలందరూ యాక్టివ్ గా ఉండాలని షర్మిల సూచించారు. అన్యాయన్ని ఎదిరించేలా, ఫేక్ వార్తలను ఎండగట్టేలా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.