BC Reservations: బీసీ కోటా.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్? రిజర్వేషన్ల దుమారాన్ని సేఫ్‌గా దాటగలదా?

BC Reservations: బీసీ కోటా.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్? రిజర్వేషన్ల దుమారాన్ని సేఫ్‌గా దాటగలదా?

Updated On : September 12, 2025 / 11:25 PM IST

BC Reservations: ఏడాదిగా అదే టాపిక్. రిజర్వేషన్లను సాధిస్తాం. లోకల్ బాడీస్‌లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతాం. బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపారు. గవర్నర్‌కు ఆర్డినెన్సూ పంపించేశారు. ఢిల్లీలో ధర్నాలు చేసినా..అసెంబ్లీలో తీర్మానం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో ఇక ఇప్పుడు ఆఖరి అస్త్రంగా ఇంకో ప్లాన్ చేస్తోందట అధికార కాంగ్రెస్. కోటా ఇవ్వలేకపోయారన్న విమర్శ రాకుండా..చేయాల్సిన ప్రయత్నమంతా చేశామని చెప్పుకోవడానికి సరికొత్త స్కెచ్ వేస్తోందట. రేవంత్ సర్కార్ దగ్గరున్న ప్లానేంటి? బీసీ కోటాపై వేస్తున్న స్కెచ్ ఏంటి .?

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు. అడుగు ముందుకు పడేది లేదు. కొలిక్కి వచ్చేది లేదన్నట్లుగా ఉంది బీసీ కోటా లొల్లి. ఈ పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. ముందుగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపారు. అదలా పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేశారు. గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపలేదు. అలా అని తిరస్కరించకుండా పెండింగ్‌లోనే పెట్టారు.

సేమ్‌టైమ్‌ 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మళ్లీ గవర్నర్‌కు పంపించారు. దీనిని లీగల్ ఒపీనియన్‌కు పంపారు గవర్నర్. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసేందుకు రెడీ అవుతోందట కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపినా..లేకపోతే ప్రభుత్వం జీవో జారీ చేసినా అది న్యాయస్థానాల్లో నిలబడే పరిస్థితి లేదంటున్నారు.

రిజర్వేషన్ల అంశం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్నారు. ఈ విషయం తెలిసి మరీ జీవో ఎందుకు జారీ చేస్తున్నారనే డౌట్ అందరికీ రావడం సహజమే. అయితే తమవంతు ప్రయత్నాలన్నీ చేశాము..ఇంక తాము చేసేదేం లేదని చెప్పుకునేందుకే జీవో పేరుతో ఇంకొన్ని రోజులు హడావుడి చేసే ప్లాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు విశ్లేషకులు.

వర్షాల పేరుతో కామారెడ్డి సభ వాయిదా..!

జీవో ఇచ్చాక ఎవరైనా కోర్టుకెళ్లి అడ్డుకుంటే నెపం వాళ్ల మీద నెట్టొచ్చనే వ్యూహం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15న కామారెడ్డి సభకు ప్లాన్ చేసి వాయిదా వేశారు. ఈ సభా వేదికగా బీసీ కోటా కోసం చేయాల్సిన ప్రయత్నమంతా చేశాం..కేంద్రం, బీజేపీ పార్టీ సహకరించలేదని చెప్తూనే..బీఆర్ఎస్‌పై దుమ్మెత్తిపోసే ప్లాన్ వేశారట. పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలనుకున్నారట. ఇదంతా పాత పాటే కావడంతో కొత్తగా సభ పెట్టి చెప్పేదేముందన్న వాదన తెరమీదకు వచ్చిందట. అందుకే కామారెడ్డి సభను కొన్ని రోజులు వర్షాల పేరుతో వాయిదా వేయాలనుకున్నారట.

ఇక ఈ నెల 30తో లోకల్ బాడీ పోల్స్ నిర్వాహణకు హైకోర్టు పెట్టిన డెడ్‌లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ అంశంతో పాటు తాము ఇచ్చిన జీవోపై వచ్చిన అభ్యంతరాలను సాకుగా చూపి..స్థానిక ఎన్నికల కోసం కోర్టును మరో మూడు నెలల గడువు కోరాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా బీసీ కోటాపై కాంగ్రెస్ చేతులు ఎత్తిసినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. చేయాల్సిన ప్రయత్నమంతా చేశామని..తమ తప్పేమి లేదని ప్రజలకు చెప్పుకోవాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

ఇంకో పది రోజుల తర్వాతైనా కామారెడ్డి వేదికగా సభ నిర్వహిస్తామంటున్నారు. అయితే ఏడాదిగా తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తారట. పైగా బిహార్ ఎన్నికల కంటే ముందే పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేశామని చెప్పుకోవాలనుకుంటున్నారట. కేంద్రం సహకరించకున్నా..ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు పార్టీ పరంగా టికెట్లు ఇచ్చామని చెప్పుకునే ప్లాన్‌లో ఉందట కాంగ్రెస్ సర్కార్.

మొత్తం మీద బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తిసినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో రేవంత్ స్పీచ్‌తోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చిందని..ఇప్పుడు జీవో ఇష్యూ చేస్తున్నామంటున్నారంటే కోటా కథ కంచికే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పరంగా బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటన చేస్తే..అది కాంగ్రెస్‌కు ఎంతవరకు కలిసి వస్తుందో..బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ఆ ఎనిమిది మంది సేఫ్? ఆ ఇద్దరిపై వేటు? క్లైమాక్స్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్..