నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్ వేసుకుంది. పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు ఎసరు పెట్టేలా పావులు కదుపుతోంది. ఓ రాజకీయ పార్టీ తరఫున గెలిచిన తర్వాత అదే పార్టీతో విభేదిస్తే ఎలా ఉంటుందన్నది రుచి చూపించేందుకు వైసీపీ డిసైడ్ అయ్యిందట.
నిజానికి వైసీపీతో విభేదించాక తనపై బహిష్కరణ వేటు ఖాయమని భావించారు రఘురామకృష్ణంరాజు. అలా జరిగితే తాను సులభంగా బీజేపీలో చేరిపోవచ్చని అనుకున్నారట. కానీ, అనర్హత వేటు పడేలా జగన్ వ్యూహాలు పన్నుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ ద్వారా ఆయనకు సంక్రమించిన అన్ని రకాల ప్రయోజనాలకు గండి కొట్టే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని చెబుతున్నాయి.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 2014లో వైసీపీ తరఫున ఎంపీలుగా గెలిచిన ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత అప్పటి అధికార పక్షమైన టీడీపీలో చేరారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ… లోక్‌సభ స్పీకర్‌ను కలిసి వీరిపై వేటు వేయాలని కోరినా సాధ్యం కాలేదు. టీడీపీ, బీజేపీ మిత్రులుగా ఉన్నందున వీరిపై వేటు పడకపోయినా ఎంపీలుగా తప్ప మిగతా పదవుల్లో మాత్రం కొత్తపల్లి గీత చోటు కోల్పోయారు.
ఇప్పుడు పరిస్థితులు వేరు. వైసీపీ అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించే సాహసం చేయరు. కానీ, రఘురామకృష్ణంరాజు స్టైల్ వేరు. బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. బీజేపీలోకి వెళ్లినా వైసీపీ తరఫున సంక్రమించిన పదవులేవీ ఆయనకు లేకుండా చేయడమే ఇప్పుడు వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుందని అంటున్నారు.
ఇలా షాకివ్వాలని డిసైడ్ అయ్యారా? :
తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు రఘురామకృష్ణంరాజు. అంతే కాకుండా పదే పదే వైసీపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్‌కు కూడా లేఖ రాశారు. దీనిపై గుర్రుగా ఉన్న జగన్.. ఈ వ్యవహారాన్ని అంత సులభంగా వదలకూడదని ఫిక్సయ్యారని పార్టీ నేతలు అంటున్నారు.
ఇప్పటికే ఆయనపై ఎంపీగా వేటు వేయాలని కోరిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు… అంతకంటే ముందే పార్టీ ద్వారా సంక్రమించిన పదవుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీగా వేటు వేయాలంటే నిబంధనల ప్రకారం విచారణ, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగా రఘురాముడికి వైసీపీ ద్వారా సంక్రమించిన అన్ని పార్లమెంటరీ పదవుల నుంచి తొలగించడం ద్వారా షాకివ్వాలని డిసైడ్ అయ్యారంట.
అసలు వ్యూహం ఇదేనా? :
ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సబార్డినేట్ లెజిస్లేషన్స్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ అండర్ టేకింగ్స్, కోల్ స్టీల్స్, జనరల్ పర్పస్, రూల్స్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. వీటన్నింటి నుంచి ఆయన్ను ముందుగా తప్పించాలని స్పీకర్‌ను కలసి వైసీపీ ఎంపీలు కోరారు.
ఎంపీ పదవి ఊడకపోయినా.. ముందు వివిధ పదవులకు ఎసరు పెట్టడం ద్వారా ఆయనను దెబ్బ తీయాలన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. వైసీపీ అభ్యర్ధన మేరకు రఘురామ కృష్ణంరాజును ఎంపీ పదవి కంటే ముందుగానే పార్లమెంటరీ పదవుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ తరఫున పార్లమెంటరీ పదవులు అనుభవిస్తున్న రఘురామకృష్ణంరాజును తొలగించాలని కోరిన వైసీపీ పార్లమెంటరీ నేతల బృందం.. ఆయన స్థానంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. అధినేత జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న బాలశౌరికి ఢిల్లీ వర్గాల్లోనూ మంచి పట్టుంది.
పార్టీ తరఫున కీలక ఎంపీల్లో ఒకరైన బౌలశౌరి ప్రస్తుతం ఇతర పార్లమెంటరీ కమిటీ పదవుల్లోనూ కొనసాగుతున్నారు. అయినా అధినేత జగన్ సూచన మేరకే రఘురామకృష్ణంరాజు స్ధానంలో బాలశౌరిని నియమించాలని స్పీకర్ ఓం బిర్లాను ఎంపీల బృందం కోరిందని చెబుతున్నారు. మరి దీనికి రఘురామకృష్ణంరాజు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.