Appalayagunta : సూర్య, చంద్ర ప్రభ వాహానాలపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వైభవం

తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Appalayagunta :  తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ స్వామివారి అలంకారంలో  శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించారు.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్నవేంకటేశ్వర స్వామి

సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఔషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

గురువారం సాయంత్రం శ్రీ ప్రసన్నవేంకటేశ్వర స్వామి వారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్ర‌ప్ర‌భ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

చంద్రప్రభ వాహనం పై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు.

ట్రెండింగ్ వార్తలు