విజయానికి ప్రతీక దసరా : చెడుపై మంచి సాధించిన విజయం   

  • Publish Date - September 25, 2019 / 09:35 AM IST

దసరా పండుగ వచ్చేస్తోంది. ఆలయాల్లో సందడి మొదలైంది. చెడుపై మంచి సాధించిన పండుగే విజయదశమి. అదే దసరా. ఆశ్వీయుజ మాసంలో వస్తోంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా.. ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. పురాణాల్లో దశమి రోజున జరుపుకునే పండుగలు చాలానే ఉన్నాయి. 

పురాణాల్లోని ముఖ్య ఘట్టాలను తీసుకుంటే.. రాముడు రావణునిపై గెలిచిన రోజుగా చెబుతుంటారు. అందుకే దసరా రోజున రావణ వధ కార్యక్రమాన్ని కూడా చేస్తారు.

అదే విధంగా13 సంవత్సరాలు వన వాసం తర్వాత ఒక సంవత్సరం అజ్నాతవాసం పూర్తయిన తర్వాత.. శమీ వృక్షం (జమ్మి చెట్టు)పై తమ ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగానూ చెబుతారు. జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. జమ్మి ఆకులతో పూజ ఆచారంగా వస్తోంది.

అంతేకాదు దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం సిద్ధించిన రోజు శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి.. మహిషాసుడ్ని వధించి విజయాన్ని పొందిన 10వ రోజే విజయదశమి అంటారు. రాక్షసుడి నుంచి ప్రజలను అమ్మవారు రక్షించింది కాబట్టి అతని వధను విజయదశమిగా ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపున్నారు.

రాక్షసుడ్ని వధించిన కథ
బ్రహ్మ దేవుడి కోసం మహిషాసురుడు ఘోర తపస్సు చేస్తాడు. మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై.. ఏం వరం కావాలో కోరుకోమంటాడు చావు లేని వరం కోరతాడు. పుట్టిన ప్రతీ ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మ చెబుతాడు. దీంతో ఓ కండీషన్ పై వరం పొందుతాడు మహిషాసురుడు. చావు అనేది స్త్రీతోనే ఉంటుందని. ఒక స్త్రీ, అబల నన్నేం చేయగలదు అనే గర్వం మహిషాసురుడిలో ఉంటుంది. అందర్నీ చిత్రహింసలు పెడుతుంటాడు. యుద్దాలు చేసి అన్ని రాజ్యాలను ఆక్రమించుకుంటాడు. స్వర్గం లోకంపై యుద్ధం చేసి.. ఇండ్రుడిని ఓడిస్తాడు. దీంతో ఇంద్రుడు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటాడు. త్రిమూర్తులు ఆగ్రహిస్తారు. కోపంలోని త్రిమూర్తుల తేజస్సుతో ఒక స్త్రీ జన్మిస్తుంది. శివ తేజస్సుతో ఆగ్రహం, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజాన్నిపాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరిస్తోంది. 18 బాహువులతో జన్మించిన స్త్రీకి శివుడు తన త్రిశూలాన్ని ఇస్తాడు. విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యమ ధర్మరాజు తన పాశము, కమండలము ఇస్తారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇస్తారు. ఇలా సర్వదేవతలు ఆయుధాలను ఇస్తారు. అత్యంత శక్తివంతమైన ఆ ఆయుధాలను భరించే శక్తి మాతగా అమ్మవారు అవతరించారు.

సర్వదేవతలు ఇచ్చిన ఆయుధాలతో గర్వంతో మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేస్తోంది.  అమ్మవారి వాహనం అయిన సింహం మహిషుడు సైన్యంపై వీర విహారం చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి యోధాను యోధులైన వారిని అమ్మవారు వధించింది. అత్యంత శక్తివంతుడైన మహిషాసురునితో అమ్మవారు యుద్ధం చేస్తోంది.

దేవితో తలపడిన అసురుడు మహిషి (దున్నపోతు) రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా తొమ్మిది రోజులు భీకర పోరాటం కొనసాగింది. 10వ రోజు మహిషిరూపములోనే మహిషాసురుడు అమ్మవారి చేతిలో చనిపోతాడు. మహిషాసురుడుని సంహరించిన రోజునే దసరాగా జరుపుకుంటారు. అదే విజయదశమి కూడా. మంచి చెడుపై విజయం సాధించింది. అదే దశమి. మహిషాసుడిని వధించింది కాబట్టి మహిషాసుర మర్థినిగా పూజలందుకుంటోంది. విజయానికి ప్రతీకగా దసరా జరుపుకోవటం జరుగుతోంది.