Sabarimala Prasadam : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమల నుంచి నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. అరవణ, అప్పం డోర్ డెలివరీ!
Sabarimala Prasadam Delivery : శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఇకపై అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను ఇండియా పోస్ట్ ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు. బుకింగ్ విధానం, డెలివరీ వివరాలు తెలుసుకోండి.
- Sreehari A
- Published on- November 14, 2026 / 05:30 PM IST
Sabarimala Prasadam Home Delivery
- శబరిమల వెళ్లే భక్తులకు బంపర్ న్యూస్..
- ఇక ఇంటికే శబరిమల ప్రసాదం పంపిణీ
- అరవణ పాయసం, అప్పం డోర్ డెలివరీ
- ఇండియా పోస్ట్ బుకింగ్‌తో ప్రసాదం ఇంటికి
Sabarimala Prasadam Delivery : శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ప్రసాదం ప్యాకెట్లు మోసుకెళ్లే ఇబ్బంది అవసరం లేదు.
అరవణ పాయసం, అప్పం వంటి అయ్యప్ప స్వామి ప్రసాదాలు నేరుగా మీ ఇంటి గుమ్మం దగ్గరికే చేరనున్నాయి. ఇందుకోసం ఇండియా పోస్ట్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
సన్నిధానం నుంచే బుకింగ్.. ఇంటికే డెలివరీ :
నవంబర్ 17 నుంచి మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. శబరిమల సన్నిధానంలోని దేవస్వం బోర్డు అరవణ, అప్పం కౌంటర్ల పక్కనే ఇండియా పోస్ట్ ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉండనుంది.
భక్తులు అక్కడే తమకు కావాల్సిన ప్రసాదాన్ని బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్పీడ్ పోస్ట్ పార్శిల్ సర్వీసు ద్వారా దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా వారి ఇంటి అడ్రస్ కే ప్రసాదాలను పంపిస్తారు. దీంతో కొండపై నుంచి తిరుగు ప్రయాణంలో ప్రసాదం ప్యాకెట్లు మోసుకెళ్లే శ్రమ తప్పుతుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ సదుపాయం భక్తులకు ఎంతో ఉపయోగపడనుంది.
పోస్టాఫీసుల్లోనూ బుకింగ్ సౌకర్యం :
మరో విశేషం ఏంటంటే.. ప్రసాదం బుక్ చేసుకునేందుకు శబరిమలకే వెళ్లాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కూడా అయ్యప్ప ప్రసాదాలను బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే అవకాశం కల్పిస్తున్నారు. సురక్షితమైన ప్యాకేజింగ్‌తో ప్రసాదాలను భక్తులకు చేరవేయనున్నారు.
ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్, కేరళ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్ ఈ సదుపాయంపై కీలక ప్రకటన చేశారు. అయ్యప్ప భక్తులకు ఇది నిజంగా మంచి వార్తే. స్వామివారి దర్శనంతో పాటు పవిత్రమైన ప్రసాదాన్ని ఇంటివద్దే అందుకోవచ్చు..
