sheetala saptami 2026 date muhurat tithi puja timings significance rituals of worshipping goddess sheetala details
Sheetala Saptami 2026 : హిందుమతంలో ఎందరో దేవీ దేవతలను పూజిస్తుంటారు. ఒక్కో సందర్భం, అవసరం కోసం ఒక్కో దేవతను ఆరాధిస్తారు. గ్రామాల్లో అయితే గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుంది. చాలా మంది తమ ఇళ్లలో, పొలాల్లో ప్రత్యేకంగా దేవతలను కొలుస్తుంటారు. అలానే హిందూ సమాజంలో పిల్లలు, పెద్దలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండటం కోసం ఓ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆమె శీతల దేవి. హోలీ పండగ అయిపోయిన వారం రోజుల తర్వాత శీతల సప్తమి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మార్చి 10న శీతల సప్తమి వస్తుంది. ఈ పవిత్రమైన పర్వదినాన చాలా మంది తల్లులు తమ పిల్లల ఆరోగ్యం కోసం ఉపవాసం ఉండి శీతల మాతను పూజిస్తారు.
శీతల సప్తమి పండగ నాడు.. దుర్గా మాతను.. శీతల దేవి రూపంలో అలంకరించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బిడ్డల ఆరోగ్యం కాపాడమని వేడుకుంటూ చాలా మంది తల్లులు ఉపవాసం చేస్తారు. శీతల సప్తమి నాడు ఇలా ఉపవాసం ఉండి.. పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పూజ చేయడం వల్ల శీతలా మాత తమ పిల్లలను తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుందని.. వారికి మంచి ఆరోగ్యం ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. దాదాపు దేశమంతా వేర్వేరు పేర్లతో ఈ పండగను జరుపుకుంటారు. చాలా ప్రాంతాల్లో బసోడా పేరుతో శీతలా సప్తమి పండగ చేస్తారు.
ఇక ఈ సంవత్సరం శీతల సప్తమి పండగను.. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలోని సప్తమి తిథి నాడు అనగా మంగళవారం, 10 మార్చి 2026న జరుపుకుంటారు.
సప్తమి తిథి ప్రారంభం: 09 మార్చి 2026 రాత్రి 11:27 గంటలకు.
సప్తమి తిథి ముగింపు: 11 మార్చి 2026 రాత్రి 01:54 గంటల వరకు.
శీతల సప్తమి నాడు ఇంట్లో కుడుములు తయారు చేస్తారు. వాటిని శీతల అష్టమి నాడు పిల్లల మీదుగా తిప్పి.. ఆ తర్వాత కుక్కలకు వేస్తారు. ఇలా చేయడం వల్ల తమ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. శీతల మాత.. మశూచీ, అమ్మవారు వంటి మహమ్మారుల నుంచి రక్షిస్తుందని ప్రజలు నమ్ముతారు.
స్కంద పురాణంలో శీతల మాత రూపం గురించి ప్రత్యేకంగా వివరించారు. శీతల మాత.. గాడిదపై ఆసీనురాలై ఉంటారు. అమ్మవారు ఒక చేతిలో కలశం, చీపురు, చిన్న కుండ పట్టుకుని ఉంటారు. అమ్మవారి చేతిలోని చీపురు పరిశుభ్రతకు ప్రతీకగా నమ్ముతారు. శీతల సప్తమి సందర్భంగా అమ్మవారికి స్వయంగా ఇంట్లో తయారు చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల మహమ్మారులు తమ పిల్లల దరి చేరవని భక్తుల విశ్వాసం. పైగా ఈ కాలంలో వచ్చే అమ్మవారు, తట్టు, మశూచి, కంటి వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ లభిస్తుందని భావిస్తారు. దక్షిణ భారతంలో శీతల సప్తమి వేళ పోలేరమ్మ, మారెమ్మ వంటి గ్రామ దేవతలను పూజిస్తారు.
శీతల సప్తమి పూజ విధానం:
శీతల సప్తమి రోజున పూజలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు. భక్తులు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి.. స్నానం చేసి.. ఇల్లు, చుట్టూ పరిసరాలు శుభ్రం చేస్తారు. పూజ స్థలాన్ని కూడా శుభ్రం చేసి.. తర్వాత శీతల దేవి విగ్రహం లేదా చిత్రాన్ని పూజా స్థలంలో ఏర్పాటు చేసి పూలతో అలంకరిస్తారు. ఆ తర్వాత పండ్లు, మిఠాయిలు, సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పించి దేవిని ప్రార్థిస్తారు. భక్తులు శ్రద్ధతో పూజలు చేసి కుటుంబ సంక్షేమం కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారు.