అత్యంత మహిమాన్వితం కార్తీక మాసం
- murthy
- Published On : November 15, 2020 / 03:57 PM IST
Significance of Kathika Masam : శివ,కేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకమాసం అని చెపుతారు పెద్దలు. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అత్యంత మహిమాన్విత మైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారు మోగిపోతాయి. శివ,పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు.
స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి “నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్.. నతీర్థ గంగాయ సమం…” అని పేర్కొన్నారు. యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శివకేశవులకు ప్రీతిపాత్రమై ఈ మాసంలో చేసే పూజలు, నోములు వ్రతాల వల్ల జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుని ప్రాముఖ్యతను తెలియజేస్తే.. ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.
ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయడం విశేషం. ఎన్ని వత్తులు వేయాలనేది వారి గురువుల సలహా మేరకు భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
మాఘమాసంలో గానీ, చైత్ర మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతము ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాణస్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఈ మాసంలో పౌర్ణమినాడు సత్యనారాయణ వ్రతం ఆచరిండం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు.
