IPL 2020: యూఏఈ క్రికెట్ బోర్డుకు రూ. వంద కోట్లు ఇచ్చిన BCCI

కరోనా యుగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఐపీఎల్ 2020ని Board of Control for Cricket in India (BCCI) విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభం అయిన IPL 13 వ సీజన్.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. దీనిలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ఐదవసారి టైటిల్ దక్కించుకుంది. దేశంలో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరగడంతో ఐపీఎల్ వాయిదా పడి చివరకు టోర్నమెంట్‌ను UAEలో నిర్వహించాలని నిర్ణయించారు.



అయితే, ఈ సీజన్‌ను నిర్వహించడానికి BCCI, Emirates Cricket Board(ECB) భారీ మొత్తాన్ని చెల్లించింది. ఐపీఎల్ 2020 సీజన్‌కి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు‌‌కి రూ.100 కోట్లు చెల్లించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణ కష్టతరం కాగా.. తాము ఆతిథ్యమిస్తామని ECB ముందుకు వచ్చింది. ఆ వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ప్రపోజల్‌ తెచ్చినా.. అన్ని వసతులు మెండుగా ఉన్న కారణంగా.. యూఏఈ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగగా.. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్‌ ఈ ఏడాది జరగకపోయి ఉంటే బీసీసీఐ రూ.4వేల కోట్లు నష్టపోయేది.



కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 2020ని UAEకి మార్చగా.. ఈ సీజన్‌లోని మొత్తం 60 మ్యాచ్‌లు దుబాయ్, షార్జా మరియు అబుదాబి అనే మూడు మైదానాల్లో జరిగాయి. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడి టీకా వస్తేనే వచ్చే సీజన్ (ఐపిఎల్ 2021) భారత్‌లో జరుగుతుందని, ఐపిఎల్ 2021 కూడా ఒకవేళ భారత్‌లో జరిగే పరిస్థితి లేకపోతే.. మొదటి ప్రాధాన్యత UAEనే అవుతుంది. 2014లో 20 ఐపీఎల్ మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చిన UAE.. ఈ ఏడాది అన్నీ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇచ్చింది.



ఇది మాత్రమే కాదు.. ఐపీఎల్ కారణంగా యూఏఈకి ఆదాయం కూడా బాగానే వచ్చింది. ఐపిఎల్ 2020 UAEలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరగగా.. ఆ సమయంలో ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బందితో సహా మొత్తం ఎనిమిది జట్లు అక్కడకు చేరుకోవడంతో.. 14 ఫైవ్ స్టార్ హోటళ్ళు సుమారు మూడు నెలలు పూర్తిగా నిండిపోయాయి. దీని ద్వారా కోట్లలో ఆదాయం లభించింది.

ట్రెండింగ్ వార్తలు