Aaron Finch: ఆస్ట్రేలియా టీ20 టీమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన ఈ స్టార్ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌లో ఆస్ట్రేలియాకు రికార్డు స్థాయిలో విజయాలు అందించిన ఫించ్ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం తెలిపాడు. ఇదివరకే టెస్ట్, వన్డేలకు అతడు గుడ్‌బై చెప్పాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 55 వన్డేలు, 76 టీ20ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ కలిపి మొత్తం 254 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఉన్నాయి.
అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన టైమ్ అని భావించినట్టు ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు ఆడలేనని గ్రహించి అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సిబ్బందికి, కుటుంబానికి, అభిమానులకు ఫించ్ ధన్యవాదాలు తెలిపాడు. 12 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం, అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడడం తనకు దక్కిన అద్భుత గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ దేశవాలీ, క్లబ్, ఇతరత్రా లీగ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం.
టీ20 ఫార్మాట్ లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఫించ్ పేరిటే ఉంది. 34.28 సగటు, 142.53 స్ట్రైక్ రేటుతో 3120 పరుగులు సాధించాడు. టీ20ల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 172. జింబాబ్వేతో 2018లో జరిగిన మ్యాచ్ లో కేవలం 76 బంతుల్లోనే 10 సిక్సర్లు, 16 ఫోర్లతో ఈ స్కోరు నమోదు చేశాడు. 2013లో ఇంగ్లండ్ పై 63 బంతుల్లో 156 పరుగులు చేసి సత్తా చాటాడు. మంచి హిట్టర్ పేరుపొందిన ఫించ్ కేవలం 5 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడి 278 పరుగులు చేశాడు. 146 వన్డేల్లో 17 సెంచరీలతో 5406 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండు శతకాలతో 3120 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.