Abhishek Sharma : అభిషేక్ శర్మ పెను విధ్వంసం.. 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు.. ఏకంగా 233 రన్స్..
పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma ) పెను విధ్వంసం సృష్టించాడు
- Thota Vamshi Kumar
- Published on- August 2, 2026 / 04:22 PM IST
Abhishek Sharma stunning knock in a Punjab Inter District Senior match
Abhishek Sharma : పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సర్ల సాయంతో ఏకంగా 233 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 256.04గా నమోదైంది. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అమృత్‌సర్ సీనియర్ జట్టు తరుపున ఆడుతూ తార్న్ తారన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, మ్యాచ్ స్కోరు కార్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల అభిషేక్ శర్మ వరుసగా విఫలం అయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్‌ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అతడు చివరి సారిగా అర్థశతకం బాదాడు.
ఇటీవల జింబాబ్వే పర్యటనలో ఘోరంగా విఫలం అయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 8, 2 పరుగులు సాధించాడు. అంటే.. 3.66 సగటుతో 11 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు మ్యాచ్‌లు లేకపోవడంతో అభిషేక్ శర్మ స్థానిక వన్డే మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో అతడు ఫామ్ అందుకుని ఊచకోత కోశాడు.
భారత టీ20 క్రికెట్‌లో రెగ్యులర్ సభ్యుడే అయినప్పటికి కూడా టెస్టు జట్టులో మాత్రం అభిషేక్ శర్మకు చోటు దక్కడం లేదు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు అతడు ఎంపిక కాలేదు. భారత జట్టు ఆగస్టు 4న శ్రీలక పర్యటకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య లంక జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
