Abhishek Sharma
Abhishek Sharma : టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. ఈ పేరు వింటే ప్రత్యర్థి జట్టులోని బౌలర్లకు హడలే. క్రీజులోకి వచ్చాక మొదటి బంతి నుంచి బౌండరీకి తరలించటమే లక్ష్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఉంటుంది. సిక్సులు, ఫోర్లతో చూస్తుండగానే.. పరుగుల వరద పారుతుంటుంది. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు అభిషేక్ శర్మను త్వరగా పెవిలియన్‌కు పంపించేందుకు మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతుంటారు. ఇటీవల జరిగిన టీ20 టోర్నీల్లో సూపర్ ఫామ్‌తో కనిపించిన అభిషేక్ శర్మ.. టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై పరుగులు రాబట్టడంతో విఫలమయ్యాడు.
శనివారం వాంఖడే స్టేడియంలో యూఎస్ఏపై భారత్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే, భారత్ జట్టు ఫీల్డింగ్ సమయంలో అభిషేక్ శర్మ మైదానంలో అడుగుపెట్టలేదు. దీంతో అతనికి ఏదైనా గాయమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ తరువాత కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ, జస్ర్పీత్ బుమ్రా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో వారు ఆడే విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పాడు.
టీమిండియా బౌలర్ మహమూద్ సిరాజ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అభిషేక్ శర్మ గురించి ప్రస్తావించాడు. అభిషేక్ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే అతను భారత జట్టు ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదని, వచ్చే మ్యాచ్‌లో బ్యాటుతో మ్యాజిక్ చేస్తాడంటూ సిరాజ్ పేర్కొన్నారు.
సూర్యకుమార్ యాదవ్, సిరాజ్ చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే.. అభిషేక్ శర్మ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. వచ్చే మ్యాచ్ నాటికి ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి వస్తాడని, లేదంటే ఆ తరువాత మ్యాచ్‌లలో అందుబాటులోకి వస్తాడని వారు చెప్పకనే చెప్పారు.