KXIP vs CSK: IPL 2020 18వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో విజయం కాగా.. అంతకుముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌కి చేరింది చెన్నై.
అయితే, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన చెన్నై చివరకు వికెట్ నష్టపోకుండా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట ఆడిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో ఎలాంటి వికెట్లు కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు గొప్ప ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 61 పరుగులు జోడించారు. మయాంక్ 19 బంతుల్లో మూడు ఫోర్లతో 26 పరుగులు చేయగా.. పియూష్ చావ్లా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
దీని తరువాత, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మన్‌దీప్ సింగ్ ఎదురుదాడి చెయ్యగా.. రెండో వికెట్‌కు రాహుల్, మన్‌దీప్ 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇందులో మన్‌దీప్ 27 పరుగులు చేయగా.. ఈ సమయంలో మన్‌దీప్ స్ట్రైక్ రేటు 168.75. కాగా జడేజా బౌలింగ్‌లో మణిదీప్ అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
తరువాత, నికోలస్ పూరన్ చెన్నై బౌలర్లపై దాడి చేశాడు. మూడు సిక్సర్ల సహాయంతో పురన్ 17 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేటు 194.12. పురన్, రాహుల్‌లను వరుసగా రెండు బంతుల్లో అవుట్ చేశాడు శార్ధూల్ ఠాకూర్. రాహుల్ 52 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 63 పరుగులు చేశాడు.
ఒక సమయంలో పంజాబ్ 17.2 ఓవర్లలో 152 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా.. తరువాత, గ్లెన్ మాక్స్వెల్ మరియు సర్ఫ్రాజ్ ఖాన్ జట్టు స్కోరును 178కి తీసుకువచ్చారు. సర్ఫరాజ్ 9 బంతుల్లో 14*, మాక్స్‌వెల్ ఏడు బంతుల్లో 11* పరుగులు చేశారు.
చెన్నై తరఫున ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా ఒక్కో వికెట్ సాధించారు. అనంతరం పంజాబ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్ అధ్భుతమైన బ్యాటింగ్‌తో వికెట్ నష్టపోకుండా చెన్నైకి విజయం దక్కేలా చేశారు. వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 83 పరుగులు చేయగా.. డూప్లెసిస్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 87 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో వాట్సన్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది.