Animesh Kujur : చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్.. విదేశీ గడ్డపై..
జర్మనీ వేదికగా జరుగుతున్న ప్యూమా ఫాస్ట్ ఆర్మ్ లెగ్స్ 2026 మీట్‌లో భారత స్ప్రింట్ సంచలనం అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డు సృష్టించాడు
- Thota Vamshi Kumar
- Updated on- July 11, 2026 / 01:12 PM IST
Animesh Kujur record fastest 100m by an Indian on foreign soil
Animesh Kujur : జర్మనీ వేదికగా జరుగుతున్న ప్యూమా ఫాస్ట్ ఆర్మ్ లెగ్స్ 2026 మీట్‌లో భారత స్ప్రింట్ సంచలనం అనిమేశ్ కుజుర్ 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 10.14 సెకన్ల వ్యవధిలో రేసును పూర్తి చేసి రెండో స్థానంతో ఫైనల్ కు చేరుకున్నాడు. ఈక్రమంలో విదేశీ గడ్డపై 100 మీటర్ల రేసులో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
భారత అథ్లెట్ల అత్యుత్తమ ఐదు 100 మీటర్ల టైమింగ్‌లలో మూడు అనిమేశ్ పేరిట ఉండటం విశేషం. జూన్‌లో జరిగిన అంతర్‌రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 20.74 సెకన్లతో 200 మీటర్ల రేసును పూర్తి చేసి, 20.88 సెకన్ల ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని సులభంగా అధిగమించాడు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనే అర్హతను కూడా సొంతం చేసుకున్నాడు.
ఓవరాల్‌గా రెండో స్థానం..
మరో భారత స్ర్పింటర్ గురిందర్‌వీర్ సింగ్ ను మాత్రం అనిమేశ్ బీట్ చేయలేకపోయాడు. గతంలో గురిందర్‌వీర్ సింగ్ 10.09 సెకన్లలో 100 మీటర్ల రేసును పూర్తి చేశాడు. ఇది భారత గడ్డపైనే. అయితే.. అనిమేశ్ కుజుర్ విదేశాల్లో అత్యుత్తమ (10.14 సెకన్లు) నమోదు చేశాడు.
100 మీటర్ల రేసులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* గురిందర్‌వీర్ సింగ్ – 10.09 సెకన్లు
* అనిమేశ్ కుజుర్ – 10.14సెకన్లు
* అనిమేశ్ కుజుర్ – 10.15 సెకన్లు
* గురిందర్‌వీర్ సింగ్ – 10.17 సెకన్లు
* అనిమేశ్ కుజుర్ – 10.18 సెకన్లు
