Harmanpreet Kaur Cries: ఓటమి బాధతో హర్మన్‌ప్రీత్ కన్నీటిపర్యంతం.. ఓదార్చిన మాజీ కెప్టెన్

Harmanpreet Kaur Cries: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో భారత్ ఓడిపోవడంతో టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగాన్ని ఆపులేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కన్నీటి పర్యంతమైంది.

Harmanpreet Kaur Cries: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ పోరాడి ఓడింది. దీంతో మహిళా జట్టు సభ్యులంతా నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగాన్ని ఆపులేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కన్నీటి పర్యంతమైంది. తన కంటతడిని కనిపించకుండా నల్ల కళ్లద్దాలతో కవర్ చేసింది. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో కౌర్ మాట్లాడుతూ.. “నేను ఏడవడాన్ని నా దేశం చూడకూడదనుకుంటున్నాను, అందుకే నేను ఈ కళ్లద్దాలు పెట్టుకున్నాను. మేము కచ్చితంగా మెరుగవుతాం. దేశాన్ని మళ్లీ ఇలా పడవేయబోమని నేను హామీ ఇస్తున్నాను”అని పేర్కొంది.

ఓటమి భారంతో కన్నీటి పర్యంతమైన హర్మన్‌ప్రీత్ కౌర్ ను మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఓదార్చారు. హర్మన్‌ప్రీత్ ను హత్తుకుని ధైర్యం నింపారు. “కెప్టెన్‌కు కొంత సానుభూతి ఇవ్వాలనేది నా ఉద్దేశంతోనే హర్మన్‌ప్రీత్ ను ఓదార్చాను. ఇది మా ఇద్దరికీ భావోద్వేగ క్షణం. భారత్ చాలాసార్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది కానీ వీరు ఓడిపోయారు. హర్మన్‌ప్రీత్ ఇలా బ్యాటింగ్ చేయడం నేను మొదటిసారి చూశాను. గాయాలు, అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా అద్భుత పోరాట పటిమ కనబరిచింది. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కాబట్టి హర్మన్‌ప్రీత్ కౌర్ పట్టుదలతో బరిలోకి దిగింది.

ఆమె వెనకడుగు వేసే ప్లేయర్ కాదు. ఎల్లప్పుడూ ముందడుగే వేస్తుంది. అనార్యోగంతో బాధపడుతున్నా కూడా మ్యాచ్ ఆడింది. 20 ఓవర్ల పాటు ఫీల్డ్‌లో పరిగెత్తింది. ఆపై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత్ ఆశలను మళ్లీ రేకెత్తించింది. జెమీమా రోడ్రిగ్స్ కూడా తన పాత్రను పోషించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంత బాధపడుతుందో సాటి క్రీడాకారిణిగా నేను అర్థం చేసుకోగలను. నేను ఆమె దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నించాను” అని అంజుమ్ చోప్రా తెలిపారు.

Also Read: సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది.. ఎందుకంటే!

ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ కేవలం 5 పరుగుల తేడాతో ఓడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధసెంచరీ(52)తో పోరాడినా పరాజయం తప్పలేదు. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులతో రాణించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి.. 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.