Abhishek Sharma : ‘నాకు అది అస్స‌లు న‌చ్చ‌లేదు.. అందుకే బ్యాట్‌తో చిత‌క్కొట్టుడు..’ పాక్‌తో మ్యాచ్ పై అభిషేక్ శ‌ర్మ కామెంట్స్‌..

పాక్ పై విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌డం పై టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) స్పందించాడు.

Asia Cup 2025 Abhishek Sharma explains motivation behind his fierce knock against Pakistan

Abhishek Sharma : ఆసియాక‌ప్ 2025 సూప‌ర్‌-4లో భాగంగా దుబాయ్ వేదిక‌గా ఆదివారం (సెప్టెంబ‌ర్ 21న‌) పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 39 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 74 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. పాక్ ఆట‌గాళ్ల క‌వ్వింపులు న‌చ్చ‌లేద‌ని, ఈ క్ర‌మంలోనే వారిపై విరుచుకుప‌డిన‌ట్లు అభిషేక్ చెప్పాడు. త‌న బ్యాట్‌తోనే వారికి స‌మాధానం చెప్పాన‌ని అన్నాడు.

భార‌త జ‌ట్టు విజ‌యంలో అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma)కీల‌క పాత్ర పోషించాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఆ త‌రువాత అత‌డు మాట్లాడుతూ.. ‘ఈరోజు చాలా సింపుల్ గా గడిచింది. వాళ్ళు ఎటువంటి కారణం లేకుండా మా వ‌ద్ద‌కు క‌వ్వింపుల‌కు దిగడం నాకు న‌చ్చ‌లేదు. అందుక‌నే బ్యాట్‌తోనే వారికి స‌మాధానం చెప్పాల‌నుకున్నా. ఈ క్ర‌మంలోనే వారిపై విరుచుకుప‌డ్డాడు. జ‌ట్టు గెల‌వాల‌ని కోరుకున్నాను.’ అని అభిషేక్ శ‌ర్మ అన్నాడు.

Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఒకే ఒక్క‌డు..

ఇక శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి ఓపెనింగ్ చేయ‌డాన్ని తాను ఆస్వాదిస్తున్న‌ట్లు అభిషేక్ చెప్పుకొచ్చాడు. పాఠ‌శాల స్థాయి నుంచే గిల్‌తో క‌లిసి ఆడుతున్నాన‌న్నాడు. ఒకరికొకరు సహవాసాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపాడు. పాక్‌తో మ్యాచ్‌లో స‌త్తా చూపించాల‌ని అనుకున్నామన్నాడు. తాము ఆశించిన విధంగానే మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పామ‌ని చెప్పాడు.

తాము ఇలా రాణించ‌డానికి జ‌ట్టు మ‌ద్ద‌తే కార‌ణం అన్నాడు. మేనేజ్‌మెంట్ వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించ‌డం వ‌ల్లే తాను రాణించ‌గ‌లుగుతున్నాన‌ని చెప్పుకొచ్చాడు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి ప్రాక్టీస్ చేస్తున్నాన‌ని తెలిపాడు. త‌న‌కు ఆ రోజు క‌లిసి వ‌స్తే జ‌ట్టు గెలిపిస్తాన‌ని తెలిపాడు.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఇన్నింగ్స్ తొలి బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. షాహిన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సైమ్ అయుబ్‌లతో పాటు హరిస్ రౌఫ్‌ల బౌలింగ్‌లో బౌండ‌రీలు బాదాడు. మ‌రోవైపు గిల్ కూడా బౌండ‌రీలు కొడుతుండ‌డంతో పాక్ ఆట‌గాళ్లు అస‌హ‌నానికి గురి అయ్యారు.

Salman Ali Agha : అందుకే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. భార‌త్ పై ఓట‌మి త‌రువాత పాక్ కెప్టెన్ కామెంట్స్‌..

ఈ క్ర‌మంలో భార‌త ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌లో త‌న బౌలింగ్‌లో గిల్ ఫోర్ కొట్టిన వెంట‌నే హ‌రిస్ రౌఫ్ నోరు పారేసుకున్నాడు. ఇందుకు అభిషేక్ శ‌ర్మ త‌గ్గ‌దేలే అంటూ అత‌డికి కౌంట‌ర్ ఇచ్చాడు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతుండ‌డంతో అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్ద‌రిని విడ‌దీశాడు. అంత‌క ముందు ష‌హీన్ కూడా ప‌లుమార్లు అభిషేక్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ పాక్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాదాడు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో శివ‌మ్ దూబె రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాద‌వ్ లు చెరో వికెట్ సాధించారు.

ఆత‌రువాత అభిషేక్ శ‌ర్మ (39 బంతుల్లో 74 పరుగులు), శుభ్‌మన్‌ గిల్ (28 బంతుల్లో 47 ప‌రుగులు), తిల‌క్ శ‌ర్మ (19 బంతుల్లో 30 నాటౌట్ ) మెరుపులు మెరిపించ‌గా 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 18.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.