Asia Cup 2025
Asia Cup 2025 : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా ఆసియా కప్ టోర్నీలో ఆడనుంది. ఈ టోర్నీ ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉండగా.. టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది.
ఆసియా కప్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ నివేదిక ప్రకారం.. ఈసారి ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్లు ఎటువంటి జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వారి ప్రస్తుత స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తాజా చర్యల నేపథ్యంలో ఆ కంపెనీ టీమిండియా స్పాన్సర్ షిప్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, బీసీసీఐ, డ్రీమ్ 11 నుంచి ఈ మేరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
ఆగస్టు 22న పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోద ముద్ర పడింది. ఇది భారతదేశంలో డబ్బు ఆధారిత గేమింగ్ కంపెనీలకు చెక్ పెట్టినట్లయింది. ఈ నిర్ణయం కారణంగా భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ డ్రీమ్ 11 ఉనికి ప్రమాదంలో పడింది. ఈ కంపెనీ టీమిండియా స్పాన్సర్ షిప్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం బీసీసీఐ త్వరలో కొత్త బిడ్‌లను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 9న ఆసియా కప్-2025 ప్రారంభానికి ముందు బీసీసీఐ స్పాన్సర్ ను పొందలేకపోతే టీమిండియా లీడ్ స్పాన్సర్ లేకుండా టోర్నమెంట్ ఆడుతుంది. డ్రీమ్ 11 లోగోలతో కూడిన ఆసియా కప్ జెర్సీలు ఇప్పటికే ముద్రించినప్పటికీ వాటిని ఈ టోర్నీకి ఉపయోగించరు.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దేశ చట్టాలను బోర్డు అనుసరిస్తుందని చెప్పారు. అనుమతి లేకపోతే మేము ఏం చేయలేము. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతి విధానాన్ని బీసీసీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు.
భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11 వ్యవహరిస్తుంది. 2023 జులైలో మూడు సంవత్సరాలపాటు ఒప్పందంపై సంతకం చేసింది. దీనికి ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉంది. జులై 2026లో బీసీసీఐతో మూడేళ్ల ఒప్పందం పూర్తవుతుంది. అంటే.. మూడేళ్ల కాలంకు డ్రీమ్ 11 టీమిండియా లీడ్ స్పాన్సర్‌గా బీసీసీఐతో రూ.358 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో స్వదేశంలో, విదేశాల్లో ఆడే మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం డ్రీమ్ 11 బీసీసీఐతో ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తే.. టీమిండియా స్పాన్సర్ లేకుండా ఆసియా కప్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది. అలాగే, బీసీసీఐ కొత్త స్పాన్సర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.