Babar Azam
Babar Azam 19 ODI Hundred : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 19 శతకాలు బాదిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ముల్తాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా కప్ (Asia Cup) మొదటి మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ పెను విధ్వంసాన్నే సృష్టించాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4సిక్సర్లు సాయంతో 151 పరుగులు చేశాడు.
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
ఈ మ్యాచ్‌లో బాబర్ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బాబర్ కెరీర్‌లో ఇది 19వ వన్డే సెంచరీ. ఇది అతడికి 102వ ఇన్నింగ్స్ మాత్రమే. వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఇంత వేగంగా 19 సెంచరీల మార్క్‌ను అందుకోలేదు. బాబర్ కంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 124, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో 19వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.
తాజా శతకం సాయంతో బాబర్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్(19)ను సమయం చేశాడు. పాకిస్తాన్ తరుపున అత్యధిక వన్డే శతకాలు బాదిన సయీద్ అన్వర్(20) తరువాతి స్థానంలో నిలిచాడు.