BCCI Criteria For New Team India Head Coach Job
BCCI – Team India Head Coach : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఈ క్రమంలో కొత్త కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. కోచ్‌కు కావాల్సిన అర్హతలు, బాధ్యతలను వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 27 సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కొత్త కోచ్ పదవి కాలం మూడున్నరేళ్లు ఉందనుంది. 2024 జూన్ 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు పదవికాలం ఉండనుంది. అంటే 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసే వరకు ఈ పదవిలో ఉండనున్నారు.
అర్హతలు..
కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి వయసు 60 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్ల పాటు హెడ్‌కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. అలాకాకున్న ఐపీఎల్ జట్లు, ఇంటర్నేషనల్ లీగ్ జట్లు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్లు ఇలా వీటిలో ఏదైన ఒకదానికి కనీసం మూడేళ్ల పాటు హెచ్ కోచ్‌గా పని చేసి ఉండాలి. ఇక సాలరీ విషయానికి వస్తే.. అనుభవం ఆధారంగా ఉండనున్నట్లు చెప్పింది.
కోచ్‌గా బాధ్యతలు చేపట్టే వారు మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. భారత జట్టు ప్రదర్శన, నిర్వహణకు మొత్తం బాధ్యత హెడ్ కోచ్‌దే కానుంది. అతడికి 14 నుంచి 16 మంది సహాయక సిబ్బంది ఉండనున్నారు.
ద్రవిడ్ సంగతేంటి..?
2021 నవంబర్ నుంచి 2023 నవంబర్ తో కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అయితే.. టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలన్ని పొడిగించింది. ద్రవిడ్ మరోసారి టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా పని చేయాలనుకుంటే అతడు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. కాగా.. కోచ్‌గా పని చేసేందుకు ద్రవిడ్ విముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.