ప్రపంచ క్రికెట్ బోర్డులలోనే ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గంగూలీ ఆధ్వర్యంలో ఆదివారం(01 డిసెంబర్ 2019) జరిగిన బీసీసీఐ తొలి సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)లో లోధా సంస్కరణల మార్పుకు ఈ మేరకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదం తెలపడమే మిగిలి ఉంది.
బీసీసీఐ చీఫ్‌గా ఎన్నికై బోర్డుపై తనదైన ముద్ర వేస్తున్న సౌరవ్ గంగూలీ ఎన్నికైన తర్వాత నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా లోధా కమిటీ సిఫార్సులపై ప్రధానంగా చర్చ జరిగింది. రెండు పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పిరియడ్), క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ), ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం తదితర కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఏజీఎమ్‌లోని సభ్యులు ఆమోదం తెలిపారు.
దీనిని సుప్రీంకోర్డు ఆమోదిస్తే, బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్ మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఉండదు.