Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. ఫీల్డింగ్ కోచ్‌గా విదేశీయుడు వద్దు.. భారతీయుడే ముద్దు..!

భారత మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని ఆసక్తి కనబరిచాడు. కానీ, బోర్డు అతనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేరును గంభీర్ సూచించగా బీసీసీఐ అందుకు తిరస్కరించింది.

BCCI rejects Jonty Rhodes in another blow to Gautam Gambhir after Vinay Kumar setback ( Image Source : Google )

Gautam Gambhir : క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఎసీ) ఏకగ్రీవంగా సిఫార్సు చేసిన నేపథ్యంలో భారత కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధృవీకరించింది. ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ సహాయక సిబ్బందిపై బీసీసీఐ దృష్టిపడింది. రాహుల్ ద్రవిడ్ మాదిరిగా భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పదవీకాలం కూడా టీ20 ప్రపంచ కప్‌తో ముగిసింది.

ఈ టోర్నీ అనంతరం రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోవడంతో అతడి స్థానంలో గంభీర్‌కు చోటు దక్కింది. సాధారణంగా, ప్రధాన కోచ్‌కి తన సొంత సహాయక సిబ్బందిని ఎంచుకోవడానికి బీసీసీఐ అనుమతిస్తుంది. ఇది గంభీర్‌కు భిన్నంగా ఏమీ ఉండదు. అయితే, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ సూచించిన పేరును బోర్డు తిరస్కరించింది.

గంభీర్ అభ్యర్థన తిరస్కరణ :
భారత మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని గంభీర్ ఆసక్తి కనబరిచాడు. కానీ, బోర్డు అతనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగే, దక్షిణాఫ్రికా దిగ్గజం ఐపీఎల్‌లోని వివిధ జట్లతో ఆడిన జాంటీ రోడ్స్ లక్నో సూపర్ జెయింట్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేశాడు. అయితే సపోర్టు స్టాఫ్‌లో విదేశీయుడిని తీసుకోవడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. గత ఏడు ఏళ్లుగా భారత్ పూర్తిగా స్థానిక సహాయక సిబ్బందితోనే పనిచేస్తోంది. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని మార్చడానికి బోర్డు ఇష్టపడలేదు.

ఈ క్రమంలో తాను సూచించిన వారికే కోచింగ్ సహాయక సిబ్బందిగా అవకాశం ఇవ్వాలని గౌతమ్ గంభీర్ షరతు విధించాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేరును గంభీర్ సిఫార్సు చేయగా, బీసీసీఐ అందుకు తిరస్కరించినట్టు నివేదికలు వెల్లడించాయి. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ మొత్తం భారతీయులే ఉండాలని బీసీసీఐ స్సష్టం చేసినట్టుగా ‘హిందూస్తాన్ టైమ్స్’ స్టోరీ పేర్కొంది.

దిలీప్‌‌కు చోటు దక్కే ఛాన్స్ :
రోడ్స్ పేరు చర్చకు రాగా ఆల్-ఇండియన్ సపోర్ట్ స్టాఫ్‌ని ఉంచాలని బోర్డు నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం.. దిలీప్‌కు మళ్లీ తలుపులు తెరచుకున్నాయి. అతను తన పదవీకాలంలో భారత జట్టుతో అద్భుతంగా పనిచేసాడు. మునుపటి కోచింగ్ స్టాఫ్‌లోని సభ్యుడు తదుపరి ప్రధాన కోచ్‌తో కొనసాగడం కూడా కొత్త కాదు.

2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత సంజయ్ బంగర్ స్థానంలో రాథోర్ రవిశాస్త్రి కోచింగ్ టీమ్‌లో చేరాడు. అలా ద్రవిడ్ పదవీకాలం వరకు కొనసాగాడు. ఇప్పుడు, దిలీప్‌కు కూడా అలాగే చేసే ఛాన్స్ ఉంది. ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న భారత మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ప్రస్తుతం జింబాబ్వేలో యువ భారత టీ20 జట్టును పర్యవేక్షిస్తున్న లక్ష్మణ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వన్డే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడని గంభీర్ సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో గంభీర్‌తో పాటు తన సొంత సహాయక సిబ్బంది కూడా చేరనున్నారు. కేకేఆర్‌లో అసిస్టెంట్ కోచ్‌గా గంభీర్‌తో కలిసి పనిచేసిన భారత మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌కు కూడా కొత్త సహాయక సిబ్బందిలో చోటు దక్కే అవకాశం ఉంది.

Read Also : Virat Kohli : హెడ్ కోచ్‌గా గంభీర్‌.. సైలెంట్‌గా కోహ్లిని ప‌క్క‌న‌బెడుతున్న బీసీసీఐ..? ఒక్క మాట కూడా చెప్ప‌కుండా..?

ట్రెండింగ్ వార్తలు