×
Ad

Team India : రోహిత్‌-కోహ్లీల‌తో క్షీణిస్తున్న గంభీర్ సంబంధాలు.. సయోధ్యకు బీసీసీఐ ప్రయత్నం!

దక్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు.

BCCI upset as Gambhir relation with Rohit and Kohli turn

Team India : దక్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు. కోహ్లీ శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. రోహిత్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యంలో వీరిద్ద‌రు కీల‌క పాత్ర పోషించారు అన్న‌ది కాద‌నలేని స‌త్యం. ఈ ఇద్ద‌రు ఇప్ప‌టికే టెస్టులు, టీ20ల‌కు గుడ్ బై చెప్పేశారు. ప్ర‌స్తుతం వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు.

ఇక ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ ఆట‌గాళ్లు 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడాల‌నే ఆలోచన‌తో ఉన్నారు. దీనిపై వీరిద్ద‌రికి టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌మైన హామీ మాత్రం రాలేదు. ఇక ఇదే స‌మ‌యంలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌తో ఈ ఇద్ద‌రికి స‌త్సంబంధాలు లేవ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ ఆట‌గాళ్లు టెస్టుల్లో రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డానికి గంభీరే కార‌ణం అన్న వాద‌న‌లు ఉన్నాయి. ఇక వీరిమ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు బీసీసీఐ ఓ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో టీమ్ఇండియా ఓడిపోయింది. ఈ సిరీస్‌ల ఓట‌మికి బాధ్యుల‌ను చేస్తూ రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీల‌ను పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టేశార‌ట‌. ఈ క్ర‌మంలోనే తొలుత రోహిత్, ఆ వెంట‌నే కోహ్లీలు టెస్టుకు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించార‌ని ఇందుకు హెడ్ కోచ్ గంభీర్‌, చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌లే అన్న వార్త‌లు వ‌చ్చాయి. ఇక అదే స‌మయంలో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీని గెలిచిన త‌రువాత హిట్‌మ్యాన్‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డంతో అటు గంభీర్, ఇటు అజిత్ అగార్క‌ర్‌ల‌పై ఫ్యాన్స్‌లో కోపం క‌ట్ట‌లు తెంచుకుంది.

IND vs SA : రెండో వ‌న్డేకు ఆతిథ్యం ఇవ్వ‌నున్న రాయ్‌పుర్ స్టేడియం.. అప్పుడు బౌల‌ర్ల‌కు.. ఇప్పుడు ఎవ‌రికో?

రోహిత్‌-కోహ్లీలోనూ గంభీర్ పై అసంతృప్తి!

గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న‌ప్పుడే భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా నిలిచింది. ఈ విష‌యం పై ఓ కార్య‌క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ..ఆ టోర్నీలో గెలిచిన జ‌ట్టును మాజీ కోచ్ ద్ర‌విడ్ త‌యారు చేశాడ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక రాంచి వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జరిగిన తొలి వ‌న్డే మ్యాచ్ అనంత‌రం భార‌త జ‌ట్టు పెవిలియ‌న్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో గంభీర్‌తో కోహ్లీ అంటీముట్ట‌నట్లుగానే వ్య‌వ‌హ‌రించాడ‌ని కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

స‌యోధ్యకు బీసీసీఐ స‌మావేశం..

ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా హెడ్ కోచ్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు మ‌ధ్య దూరం పెరుగుతుండ‌డం జ‌ట్టుకు అయితే అస‌లు మంచిది కాదు. జ‌ట్టు వాతావ‌ర‌ణం కూడా దెబ్బ‌తింటుంది. అందుక‌నే బీసీసీఐ వీరి మ‌ధ్య ఓ స‌యోధ్య స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ దిశ‌గా రోహిత్‌, కోహ్లీల ప్ర‌ణాళిక‌ల‌ను తెలుసుకోవ‌డం, టీమ్‌మేనేజ్‌మెంట్ వీరి నుంచి ఏం ఆశిస్తుందో తెలియ‌జేయ‌డం ఈ స‌మావేశం ఎజెండా చెబుతున్న‌ప్ప‌టికి కూడా ముఖ్య ఉద్దేశం మాత్రం స‌యోధ్య అని స‌మాచారం. రెండో వ‌న్డే మ్యాచ్ అనంత‌రం, గానీ మూడో వ‌న్డే మ్యాచ్ అనంత‌రం గానీ ఈ స‌మావేశం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.