IND vs SA : రెండో వన్డేకు ఆతిథ్యం ఇవ్వనున్న రాయ్‌పుర్ స్టేడియం.. అప్పుడు బౌలర్లకు.. ఇప్పుడు ఎవరికో?
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల (IND vs SA) మధ్య బుధవారం (డిసెంబర్ 3న) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
IND vs SA Do you know Team India ODI record at Raipur Stadium
IND vs SA : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం (డిసెంబర్ 3న) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతథ్యం ఇవ్వనుంది. తొలి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటకే ఇరు జట్లు (IND vs SA ) రాయ్‌పుర్ చేరుకున్నాయి. ప్రాక్టీస్‌లో నిమగ్నం అయ్యాయి.
ఇక ఈ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడింది. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. షమీ మూడు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
109 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి 20.1 ఓవర్లలో అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (50) హాఫ్ సెంచరీతో చెలరేగగా శుభ్‌మన్ గిల్ (40 నాటౌట్) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ(11) విఫలం అయ్యాడు.
పిచ్ ఎలా ఉండనుందంటే?
దేశంలోని పెద్ద మైదానాల్లో రాయ్‌పుర్ మైదానం ఒకటి. ఈ మైదానంలో పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు అనుకూలిస్తుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు పండగ చేసుకోవచ్చు. బౌండరీలు దూరంగా ఉంటాయి.
