తన బంతికి తానే బలి: బ్యాట్స్‌మన్ షాట్‌కు నేలకొరిగిన బెంగాల్ ఫేసర్

బెంగాల్ ఫేసర్ ఆశోక్ దిండా వేసిన బంతి తనకే తగిలి ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేలకొరిగి విలవిల్లాడిపోయాడు. బెంగాల్ టీ20 మ్యాచ్ ప్రాక్టీసు జరుగుతుండగా ఈ ఘటన జోటు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగాల్, మిజోరాం జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతోంది. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బెంగాల్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అశోక్ దిండా వేసిన బంతిని బ్యాట్స్‌మన్ బీరేందర్ వివేక్ సింగ్ స్ట్రైట్ డ్రైవ్ చేసేందుకు యత్నించాడు. ఆ షాట్‌ను ఊహించిన ప్లేయర్లు క్యాచ్ అందుకునేందుకు కూడా సిద్ధమైపోయారు. 

కానీ, అంతలోనే బంతి బౌలర్ అశోక్ తలకు తగిలింది. అనూహ్యంగా తనమీదకే వచ్చిన బంతిని పసిగట్టలేని దిండా ప్రమాదానికి గురైయ్యాడు. బంతి నేరుగా వచ్చి అతని నుదుటిపై తగలడంతో క్షణాల్లో బాధతో విలవిల్లాడుతూ నేలమీద కుప్పకూలాడు. వెంటనే ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లు నిర్వహించిన పెద్దగా ప్రమాదం లేదని చెప్పడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు.

రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని భయపడాల్సిందేమీ లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 21న కటక్‌లోని బరబతి స్టేడియం వేదికగా మిజోరాం, బెంగాల్‌లు టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.