PAK vs NZ Match in Champions Trophy 2025
Champions Trophy PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ ప్రారంభమైంది. బుధవారం తొలి మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. తొలి మ్యాచ్ లోనే ఆతిధ్య జట్టుకు భంగపాటు ఎదురైంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.
Also Read: Champions Trophy 2025: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర కామెంట్స్
కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 320 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ విఫలమైంది. కేవలం 260 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ అయింది.
న్యూజిలాండ్ జట్టు ఇన్నింగ్స్ ను పేలవంగా ఆరంభించినా.. ఘనంగా ముగించింది. కివీస్ జట్టు ఓపెనర్లు తొలుత నెమ్మదిగా ఆడారు. ఈ క్రమంలో ఏడు ఓవర్లలో 39 పరుగులు మాత్రమే చేశారు. ఆ తరువాత ఒక్క పరుగు తేడాతో కాన్వే, విలియమ్సన్ ఔట్ కాగా.. క్రీజులోకి వచ్చిన డరిల్ మిచెల్ (10) కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన లేథమ్ అప్పటికే క్రీజులో ఉన్న విల్ యంగ్ తో కలిసి జట్టు స్కోర్ ను ముందుకు నడిపించే బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఈ క్రమంలో విల్ యంగ్( 107), లేథమ్ (118 నాటౌట్) సెంచరీలతో పాకిస్థాన్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది.
భారీ పరుగుల లక్ష్య ఛేధనకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు బ్యాటర్లు ఆది నుంచి వికెట్లు కోల్పోతూ వచ్చారు. పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులు మాత్రమే పాకిస్థాన్ జట్టు చేయగలిగింది. ఖుష్దిల్ షా (69), బాబర్ అజామ్ (64), సల్మాన్ అలీ అఘా (42) మినహా మిగిలిన పాక్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. మరోవైపు బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లో పాక్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవటంతో ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలమైంది. దీంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.
NEW ZEALAND BEAT PAKISTAN BY 60 RUNS IN THE CHAMPIONS TROPHY. 🇳🇿 pic.twitter.com/rAjLzWgwMP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2025
పాకిస్థాన్ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఇందులో న్యూజిలాండ్ జట్టుతో ఓడిపోయిన పాక్.. భారత్, బంగ్లాదేశ్ జట్లతో తలపడాల్సి ఉంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 27న బంగ్లా జట్టుతో పాక్ తలపడనుంది. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలి. అప్పుడే పాకిస్థాన్ నాలుగు పాయింట్స్ తో గ్రూప్-ఏ టాప్-2లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ భారత, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ లో ఓడి నాలుగు పాయింట్స్ సాధిస్తే రన్ రేట్ కీలకం అవుతుంది.