Ishan kishan
Ishan Kishan: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసినందుకు టీమిండియా బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ హర్షం వ్యక్తం చేశాడు. ద్విశతకం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ‘‘మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔట్ అయ్యాను. లేదంటే 300 పరుగులు చేసేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకాలు చేయగా, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో ద్విశతకం చొప్పున చేశారు.
అటువంటి లెజెండ్ల సరసన తాను నిలవడం పట్ల గర్వంగా ఉందని ఇషాన్ కిషన్ అన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ చక్కటి సహకారం అందించాడని చెప్పాడు. తాను 95 పరుగులు చేశాక, సిక్సుతో శతకం పూర్తి చేసుకోవాలని అనుకున్నానని అన్నాడు. అయితే, సింగిల్స్ కోసమే ప్రయత్నించాలని కోహ్లీ చెప్పాడని తెలిపాడు.
బ్యాటింగ్ కు ముందు సూర్య కుమార్ యాదవ్ తో చాటింగ్ చేశానని, బంతిని బాగా గమనించి ఆడాలని చెప్పాడని తెలిపాడు. అవకాశాన్ని వినియోగించుకోవాలనే తాను అనుకున్నానని, ఒత్తిడికి గురి కావద్దని భావించానని చెప్పాడు. కాగా, ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసి టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో లిట్టన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇషాన్ కిషన్ మొత్తం 10 సిక్సులు 24 ఫోర్లు బాదాడు. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా 200 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. దీంతో ఇషాన్ పై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.
Bangladesh vs India: బంగ్లాదేశ్ ముందు 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా