పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఆడటాన్ని నిషేదించడం సరైన నిర్ణయమేనని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అంటున్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఐసీసీ నిర్వహిస్తోన్న టోర్నీలలో భారత్.. పాక్ మ్యాచ్‌లను రద్దు చేయాలంటూ సర్వత్రా నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రవి శంకర్ ప్రసాద్ తన గొంతు వినిపించారు.
‘నేను ఇరు దేశాల క్రికెట్‌పై ఎలాంటి కామెంట్లు చేయాలనుకోవడం లేదు. కానీ, ఎక్కువ సంఖ్యలో కోరుతున్నారు కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించడమే మంచిది. దీని గురించి బీసీసీఐ.. ఐసీసీని సంప్రదిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. వాళ్లు కూడా భారతీయులకు అనుకూలమైన నిర్ణయమే తీసుకోవడమే సరైనది. అంతేకానీ, వాళ్ల పరామర్శ, అమరులైన జవాన్లపై చూపించే జాలి ఎవ్వరికీ అక్కర్లేదు’ అని తెలిపాడు.
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది. దాంతో పాటు మ్యాచ్‌లు రద్దు అయినా సరే పాక్ ఖాతాలో పాయింట్లు చేరతాయని.. ఫైనల్‌కు వెళ్తే కచ్చితంగా ఆడాల్సి వస్తుందని తెలిపింది. ఇదిలా ఉంచితే, ఉగ్రదాడిపై స్పందించిన ఐసీసీ తమకు బీసీసీఐ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే వరల్డ్ కప్ జరుగుతుందని వెల్లడించింది.