Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగ్రేటం ఆలస్యం కానుందా? సందిగ్ధంలో ఐర్లాండ్ సిరీస్..?
భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్ సందిగ్ధంలో పడింది. దీంతో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) అరంగ్రేటం కాస్త ఆలస్యం కావొచ్చునని వార్తలు వస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 12, 2026 / 10:30 AM IST
Dark clouds are looming over Vaibhav Sooryavanshi potential India T20I debut
- సందిగ్ధంలో భారత్, ఐర్లాండ్ సిరీస్..
- బెల్‌ఫాస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు
- సిరిస్ వాయిదా పడితే ఆలస్యం కానున్న వైభవ్ అరంగ్రేటం
Vaibhav Sooryavanshi : ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేసిన భారత సీనియర్ టీ20 జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకుని సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ యువ ఆటగాడు ఎప్పుడెప్పుడు టీమ్ఇండియా తరుపున ఆడతాడా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో వైభవ్ అరంగ్రేటం చేస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో పరిస్థితులు ఏమంత బాగాలేవు. దీంతో భారత్, ఐర్లాండ్ సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే వైభవ్ అరంగ్రేటం కాస్త ఆలస్యం అవుతుంది.
అక్కడ అల్లర్లు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో నిరసన కారులు రోడ్లపైకి వచ్చి భీభత్సం సృష్టిస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో లిస్బర్న్‌లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 టోర్నీని రద్దు చేశారు. అదే సమయంలో ఆదివారం జరగాల్సిన ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌ల గురించి రాబోయే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, అభిమానుల భద్రతే తమకు అత్యంత ముఖ్యం అని క్రికెట్ ఐర్లాండ్ స్పష్టం చేసింది. పరిస్థితులు మరింత దిగజారితే భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశముందని సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఐర్లాండ్‌తో భారత్ జూన్ 26న తొలి టీ20 మ్యాచ్, 28న రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా బెల్‌ఫాస్ట్ వేదికగానే జరగనున్నాయి. ఒకవేళ ఐర్లాండ్‌తో సిరీస్ రద్దైనా.. లేదా వాయిదా పడినా కూడా అంతర్జాతీయ అరంగ్రేటం కోసం వైభవ్ ఇంగ్లాండ్ సిరీస్ వరకు వేచి చూడక తప్పదు.
ఇదిలా ఉండగా.. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడు. శ్రీలంక-ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన వైభవ్.. అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు.
