Dhruv Jurel
Dhruv Jurel : ధ్రువ్ జురెల్.. ఇతనెవరా అని క్రికెట్ అభిమానులు వెతుకులాట మొదలెట్టారు. ఎందుకంటే.. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఇంగ్లాడ్ జట్ల మధ్య జరిగే రెండు టెస్టు మ్యాచ్ లకు టీమిండియా జట్టులో ఈ యువ కెరటం ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని వెతికే వారికి.. ధ్రువ్ వెనుక అతని తల్లే కనిపిస్తోంది. తన కొడుకు లక్ష్యాన్ని చేరుకునేందుకు తల్లి చేసిన త్యాగం, సహకారం, ప్రోత్సాహం.. ఇలా తల్లి గొప్పతనం కళ్లముందు ఆవిష్కృతమవుతుంది.
మూడో వికెట్ కీపర్..
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ టెస్టు సిరీస్ లో భాగంగా ఉత్తర ప్రదేశ్ ఆటగాడు ధ్రువ్ జురెల్ ను మొదటి రెండు టెస్టులకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మధ్యలో విరామం కోరిన ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగిరాలేదు.. అతని స్థానంలో ధ్రువ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. మూడో వికెట్ కీపర్ గా ధ్రువ్ జట్టులో ఎంపికయ్యాడు. వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, భరత్ లు కూడా జట్టులో ఉన్నారు. గతేడాది విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ లో అరంగ్రేటం చేసిన జురెల్.. దేశవాళీ సర్క్యూట్ లో 46 సగటుతో 15 మ్యాచ్ లు ఆడి 790 పరుగులు చేశాడు. ధృవ్ జురెల్ కథ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తల్లి మద్దతుతో ఈ యువ కెరటం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.
నాన్న వద్దన్నా.. అమ్మ తోడుగా నిలిచింది..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్. కార్గిల్ యుద్ధంలో పోరాడారు. తన తండ్రికి తొలి నుంచి తనలాగే ఆర్మీలో చూడాలని కోరిక ఉండేది.. అది కుదరకపోయే సరికి ప్రభుత్వ ఉద్యోగిగానైనా చూడాలనుకున్నాడు. అయితే, ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే ఉడేది.. కానీ, ఆ విషయం తండ్రికి చెప్పాలంటే భయమేసేది. ఓ రోజు ధైర్యం చేసి నాకు క్రికెట్ బ్యాట్ కొనివ్వమని అడిగాడు. ధ్రువ్ క్రికెట్ ఆడటం ఏమాత్రం నచ్చకపోవటంతో తండ్రి అందుకు ఒప్పుకోలేదు. క్రికెట్ ఆడనివ్వకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ తల్లితో చెప్పాడు. దీంతో చలించిపోయిన తల్లి.. కొడుకును ఓదార్చింది. ధ్రువ్ తండ్రిసైతం తరువాత బుజ్జగించి రూ. 800 అప్పుచేసి క్రికెట్ బ్యాట్ కోసం ఇచ్చాడు.
బంగారు గొలుసు అమ్మి..
కొంతకాలం తరువాత ధ్రువ్ కు క్రికెట్ కిట్ అవసరమైంది. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. దాని ధర రూ. 6 వేల నుంచి రూ.7వేల వరకు ఉంటుంది. కానీ తండ్రి అందుకు ఒప్పుకోలేదు.. ధ్రువ్ అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్లి తలుపు లాక్ వేసుకున్నాడు. తరువాత ధ్రువ్ తల్లి బుజ్జగించి.. బంగారం గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది. ఢిల్లీ జట్టులో స్థానంకోసం ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు.. ఆగ్రా నుంచి నోయిడా వరకు తరచూ ప్రయాణం చేయడం ధ్రువ్ కు ఇబ్బందిగా ఉండేది. మళ్లీ ధ్రువ్ తల్లి కొడుకు కెరీర్ కోసం నోయిడాలో నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అలా తల్లి ప్రోత్సాహంతో ధ్రువ్ అంచెలంచెలుగా ఎదుగుతూ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆండర్ -19 ఆడుతున్న సమయంలో తండ్రి సైతం ధ్రువ్ పట్టుదలకు మెచ్చి క్రికెట్ లో మరింత రాణించేందుకు ప్రోత్సహించాడు.
ఐపీఎల్ లో ఇలా..
2022లో ధ్రువ్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కనీస ధర రూ. 20లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ ఏడాది బెంచ్ కే పరిమితం అయ్యాడు. 2023లో అరంగ్రేటంలోనే రాణించాడు. తొలి మ్యాచ్ లో 15 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే, ఆ మ్యాచ్ ఆర్ఆర్ జట్టు ఓడిపోయినప్పటికీ ధ్రువ్ బ్యాటింగ్ తీరు అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ లో మొత్తం 13 మ్యాచ్ లు ఆడిన ధ్రువ్ 11 ఇన్నింగ్స్ లలో 152 పరుగులు చేశాడు.
జురెల్ స్పందిస్తూ..
తొలిసారి టీమిండియా జట్టులో ఎంపికైన సందర్భంగా ధ్రువ్ జురెల్ మాట్లాడారు.. అయితే, అంతర్జాయతీ జట్టులో ఎంపికైనట్లు అతనికి తన స్నేహితులు చెప్పారట. వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. వారు ఏ భారత జట్టుకు ఎంపికయ్యావు అంటూ ప్రశ్నించడంతో.. రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఉన్న భారత జట్టుకు అని ధ్రువ్ చెప్పాడట.. దీంతో కుటుంబ సభ్యులు మొత్తం భావోద్వేగానికి గురయ్యారని, వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ధ్రువ్ జురెల్ చెప్పాడు.