DO you know Indias record in Tests at headlingley
శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు హెడింగ్లీ వేదిక కానుంది. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్‌లు ఆడింది ? వాటిలో ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది? ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడింది? ఎన్ని మ్యాచ్‌లను డ్రా చేసుకుంది ? అన్న విషయాలను ఓ సారి చూద్దాం..
లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
తొలి విజయం ఎప్పుడంటే..?
1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు హెడింగ్లీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. అప్పుడు ఇంగ్లాండ్ పై 279 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది.
చివరి విజయం ఎప్పుడంటే.?
హెడింగ్లీలో మరో మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత్‌కు 16 సంవత్సరాలు పట్టింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2002లో ఇంగ్లాండ్‌లో పర్యటించింది భారత్. హెడింగ్లీలో జరిగిన నాటి మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ (148), సచిన్ టెండూల్కర్ (193), సౌరవ్ గంగూలీ (128) శతకాలు బాదడంతో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
కోహ్లీ నాయకత్వంలో..
చివరిసారిగా భారత్ 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకే కుప్పకూలింది. జోరూట్ (121) శతకంతో చెలరేగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (59), పుజారా (91), కోహ్లీ (55)లు అర్థశతకాలతో రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో భారత్ 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
గిల్ నాయకత్వంలోనైనా..
హెడింగ్లీలో భారత జట్టు విజయం సాధించి 23 ఏళ్లు దాటింది. ఇప్పుడు గిల్ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో హెడింగ్లీలో భారత్ మూడో విజయాన్ని అందుకుంటుందా? లేదా అన్నది చూడాల్సిందే.