సంచలన ప్లాన్.. బుమ్రాను తొలి టెస్ట్ ఆడించకుండా ఇంగ్లాండ్‌ను ఇలా దెబ్బకొట్టండి.. మాజీ క్రికెటర్ సలహా.. ఇదే జరిగితే..

ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు తిరుగులేని రికార్డు ఉంది.

Jasprit Bumrah (Image:ANI)

ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను ఒకే ఒక్క ప్రశ్న వేధిస్తోంది. అదే బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్. అతను సిరీస్ మొత్తం ఆడటం కష్టమేనంటూ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఒక సంచలన వ్యూహాన్ని ప్రతిపాదించాడు. ఇది ఇంగ్లాండ్‌ను మానసికంగా దెబ్బతీసే “మాస్టర్ ప్లాన్” అని క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బ్రాడ్ హాగ్ ‘సీక్రెట్’ స్ట్రాటజీ ఏంటి?

బుమ్రాను నేరుగా తొలి టెస్టులో ఆడించవద్దని అతడిని ఒక ఆయుధంగా దాచిపెట్టి, సరైన సమయంలో ప్రయోగించాలని హాగ్ సూచిస్తున్నాడు. “బుమ్రా లాంటి బౌలర్ ఒక్క స్పెల్‌తో మ్యాచ్ గమనాన్ని, సిరీస్ ఫలితాన్ని మార్చగలడు. అందుకే అతడిని లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్ వంటి కీలక మ్యాచ్‌లలోనే ఆడనివ్వాలి. మొదటి టెస్టుకు విశ్రాంతినివ్వాలి” అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్‌ను మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యం

ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఇంగ్లాండ్‌ను మానసికంగా ఒత్తిడిలోకి నెట్టడమే. హాగ్ అభిప్రాయాల ప్రకారం.. తొలి టెస్టులో బుమ్రా లేకపోవడంతో ఇంగ్లాండ్ ‘బుమ్రా లేడు, ఇది మాకే ప్లస్’ అని తేలిగ్గా తీసుకుంటుంది. కానీ, రెండో టెస్టులో బుమ్రా పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగితే ఇంగ్లాండ్ షాక్‌కు గురవుతుంది. అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోలేక “క్యాచప్ మోడ్”లోకి వెళ్లిపోతుంది. ఇది భారత్ గెలవడానికి దోహదపడుతుంది.

బుమ్రా ఫిట్‌నెస్ ఎందుకంత కీలకం?

బుమ్రా భారత బౌలింగ్ విభాగానికి ఒక బ్రహ్మాస్త్రం వంటివాడు. అయితే, అతని గాయాల చరిత్ర జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు దూరమయ్యాడు.

ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు తిరుగులేని రికార్డు ఉంది. కేవలం 9 టెస్టుల్లో 37 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండుసార్లు ఐదు వికెట్ల చొప్పున తీశాడు. అతని బౌలింగ్ అక్కడి పిచ్‌లపై ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.

బుమ్రా ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ అతడిని ఒక “ఇంపాక్ట్ ప్లేయర్”గా వాడాలన్న బ్రాడ్ హాగ్ సలహా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందా? లేక సంప్రదాయ పద్ధతిలోనే ముందుకు వెళ్తుందా? అనేది వేచి చూడాలి.