Lionel Messi
Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ నెలలో మెస్సీ ఇండియాలో పర్యటిస్తారు. గోట్ టూర్ టు ఇండియా 2025లో భాగంగా కేరళలోని కొచ్చిలో జరగాల్సిన అర్జెంటీనా ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఆ ప్లేస్‌లో హైదరాబాద్ ను చేర్చినట్లు టూర్ ఆర్గనైజర్ శత్రు దత్తా శనివారం ప్రకటించారు. ఈ పాన్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ కోల్ కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలకు వచ్చి సందడి చేయనున్నారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ డిసెంబర్ 13న రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియం లేదా గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ ఆడనున్నారు. అదేరోజు సాయంత్రం ఫ్యాన్స్, సెలెబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఉంటుందని ఆర్గనైజర్స్ తెలిపారు.
డిసెంబర్ 12-13 అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున లియోనెల్ మెస్సి కోల్‌కతా చేరుకుంటారు. సాల్ట్ లేక్ స్టేడియం ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 13 సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. డిసెంబర్ 14వ తేదీన ముంబయి, డిసెంబర్ 15వ తేదీన ఢిల్లీలో పర్యటిస్తారు. ఆ రోజు ప్రధాని మోదీతోనూ మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు తెలిపారు.
అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం కారణంగా కేరళ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. అయితే, టూర్ ఆర్గనైజర్ శత్రు దత్తా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ ప్రజలు, ముఖ్యంగా కేరళ, చెన్నై, హైదరాబాద్ ప్రజలు కొచ్చిలో జరగాల్సిన మ్యాచ్ రద్దు తర్వాత తాము కోల్పోయినట్లు భావించకూడదని నేను కోరుకున్నాను. అందుకే హైదరాబాద్ సహజ ఎంపిక. ఇది కేంద్రంగా ఉంది. భారీ అభిమానులను కలిగి ఉందని అన్నారు.