French Open Rafael Nadal
French Open Rafael Nadal : స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ జోరు మీదున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. క్లే కోర్టుల్లో ఎదురులేని నాదల్.. రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ లో విజేతగా నిలిచాడు. రోలాండ్ గారోస్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో నాదల్ 6-3, 6-3, 6-0తో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను మట్టికరిపించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్… చివరి సెట్ లో పూర్తిగా చేతులెత్తేశాడు. బలమైన సర్వీసులు, వ్యాలీలు, రిటర్న్ లు, డ్రాప్ షాట్లతో నాదల్ తన ప్రత్యర్థిపై తిరుగులేని విధంగా పైచేయి సాధించాడు.
US Open 2019 : 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న నాదల్
ఓవరాల్ గా నాదల్ కు ఇది 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడు నాదల్ ఒక్కడే. నాదల్ సమకాలికులు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు.
గ్రాండ్ స్లామ్ చరిత్రలో ఒకే టైటిల్ ను అత్యధికసార్లు గెల్చుకున్న ఏకైకా ఆటగాడిగా నాదల్ చరిత్రలో నిలిచిపోయాడు. సరిగ్గా 15ఏళ్ల క్రితం 19ఏళ్ల ప్రాయంలో ఇదే రోలాండ్ గారోస్ లో విజేతగా నిలిచిన నాదల్.. తాజా విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్న అతిపెద్ద వయసు ఆటగాడిగా నిలిచాడు. రెండు రోజుల క్రితమే తన 36వ బర్త్ డే జరుపుకున్న నాదల్.. ఫైనల్ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ప్రత్యర్థిని చిత్తు చేసి ఎర్రమట్టిపై మరోసారి విజయపతాకం ఎగురవేశాడు.