Rohit Sharma
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ -2025 టోర్నీ బుధవారం ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిధ్యం ఇస్తుండగా.. తొలి మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే, ఈ టోర్నీలో భారత్ జట్టు తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇప్పటికే దుబాయ్ కి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ ను రేపు బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. ఈనెల 23న పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. దుబాయ్ చేరుకున్న భారత్ ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతోపాటు ఇతర ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ స్థానిక ఎడమచేతి వాటం పేసర్ అవాయిస్ అహ్మద్ బౌలింగ్ లో ప్రాక్టీస్ చేశాడు. అవాయిస్ అహ్మద్ తన స్వింగ్ యార్కర్లతో రోహిత్ శర్మను ఇబ్బందిపెట్టాడు. అయితే, ప్రాక్టీస్ అనంతరం వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రాక్టీస్ అనంతరం వెళ్తున్న క్రమంలో రోహిత్ శర్మ అవాయిస్ అహ్మద్ వీపుపై తడుతూ అతని బౌలింగ్ తీరును అభినందించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. నువ్వు సూపర్ గా బౌలింగ్ చేస్తున్నావు.. కానీ, నీ పదునైన ఇన్ స్వింగింగ్ యార్కర్లతో నా కాలును విరగ్గొట్టడానికి ప్రయత్నించావు కదు అంటూ రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, అవాయిస్.. మీకు బౌలింగ్ చేయాలన్న నా కల నిజమైందని అన్నాడు. హింట్ మ్యాన్ స్పందిస్తూ.. నువ్వు బాగా బౌలింగ్ చేశావు. మా ట్రైనింగ్ సెషన్‌లో మీరంతా సహాయం చేసినందుకు థాంక్స్ అని రోహిత్ అతడితో అన్నాడు. రోహిత్, అవాయిస్ అహ్మద్ మధ్య సరదా సంభాషణ జరిగే సమయంలో శుభమన్ గిల్ కూడా ఉన్నాడు.