Tamilnadu Premier League
TNPL 2025: క్రికెట్ మ్యాచ్‌లలో పలు సందర్భాల్లో నవ్వులు తెప్పించే విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా.. క్రికెట్ అభిమానులకు నవ్వులు తెప్పించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయ్యా మీరు క్రికెట్ ఆడుతున్నారా..? ఇంకేదైనా గేమ్ ఆడుతున్నారా.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: WTC final 2025 : డబ్ల్యూటీసీ విజేతగా దక్షిణాఫ్రికా.. ఫైనల్‌లో ఆసీస్ పై ఘన విజయం..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 (TNPL 2025)లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ లీగ్ లో భాగంగా శనివారం సీచెమ్ మదురై పాంథర్స్, దిండిగుల్ డ్రాగన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దిండిగుల్ టీమ్‌కు భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మధురై పాంథర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
చివరి ఓవర్లో ఐదో బంతిని మదురై పాంథర్స్ బ్యాటర్ గుర్జప్‌నీత్ సింగ్ షాట్ కొట్టాడు. వెంటనే పరుగుకోసం ప్రయత్నించాడు. కవర్స్ లోని అశ్విన్ బంతిని అందుకొని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. ఆ బంతి వికెట్లకు తాకకుండా వెళ్లిపోయింది. వెంటనే బ్యాటర్లు మరో పరుగుకు వెళ్లిపోయారు. అటువైపు ఉన్న ఫీల్డర్ బంతిని అందుకొని కీపర్ కు విసిరాడు. ఆ బంతిని కీపర్ అందుకోలేక పోవడంతో బ్యాటర్లు మూడో పరుగును కూడా తీశారు. మళ్లీ నాలుగో రన్ కోసం ప్రయత్నించగా.. ఫీల్డర్ కాస్త తెలివిగా ఆలోచించి బంతిని విసరలేదు.
ఈ ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. భయ్యా మీరు ఆడేది క్రికెట్టా.. ఇంకేదైనా గేమా..? అంటూ పేర్కొంటున్నారు. అయితే, ఈ మ్యాచ్ లో చివరికి అశ్విన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న దిండిగుల్ డ్రాగన్ జట్టు విజయం సాధించింది. మదురై పాంథర్స్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని అశ్విన్ టీం కేవలం 12.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది.