Gautam Gambhir : శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు గంభీర్ హెచ్చరిక.. ప్రతి సవాల్‌కు..

శ్రీలంక‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) కీల‌క సందేశం ఇచ్చాడు.

Gautam Gambhir Sends Big Message To players Ahead Of IND vs SL Test Series

Gautam Gambhir : భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య ఆగ‌స్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్ మొద‌లెట్టింది. కాగా.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ కీల‌క సందేశం ఇచ్చాడు. సిరీస్‌లో తొలి రోజు నుంచే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా పూర్తిగా సిద్ధంగా ఉండాలని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు సూచించారు.

బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో గంభీర్ మాట్లాడుతూ.. మన ముందున్న సవాల్ ఏంటో మనందరికీ తెలుసు. మ‌నం దేని కోసం ఆడుతున్నామో మ‌న‌కు తెలుసు. మ‌నం ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ఆడ‌గ‌లం. సాధనలో ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో చేయాలి. ఆగస్టు 15 ఉదయం మనం ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఎలాంటి ప్రశ్న ఎదురైనా మన దగ్గర సమాధానం ఉండాలి. కాబ‌ట్టి ఇప్ప‌టి నుంచి మ‌నం అన్ని విధాలుగా రాణించేలా చూసుకుందాం అని గంభీర్ అన్నాడు.

IND vs SL : టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా గెల‌వ‌కుండా శ్రీలంక మాస్ట‌ర్ ప్లాన్.. అన్ని తెలిసి కూడా ఏం చేయ‌క‌పోతున్న గిల్ సేన‌..

అదే సమయంలో భారత టెస్ట్ జట్టులో కొత్తగా చోటు దక్కించుకున్న ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సరాంశ్ జైన్, పేస‌ర్‌ అకీబ్ నబీకి గంభీర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే భారత జట్టు కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్‌కు కూడా స్వాగతం పలికారు.

సరాంశ్ జైన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ స్థాయికి రావడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. అవకాశం వచ్చినప్పుడు నీ కుటుంబంతో పాటు దేశానికి కూడా గర్వకారణంగా నిలవాలి అని అన్నాడు. ఇక అకీబ్ నబీ గురించి మాట్లాడుతూ.. గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశావు. జమ్మూ కశ్మీర్‌కు రంజీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించావు. నీ విజయానికి అభినందనలు అని చెప్పుకొచ్చాడు. ఇక కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు ఎన్నో జట్లతో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన నిబద్ధత, ఉత్సాహం జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాయని, మన లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఆటగాడికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాను అని గంభీర్ అన్నాడు.

ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పట్టికలో భారత్ 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతం పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకోవడానికి అటు భార‌త్‌, ఇటు శ్రీలంక‌కు ఈ సిరీస్ ఎంతో కీల‌కం.