టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన కెరీర్‌ను పొడిగించుకోవాలంటే మైదానం వెలుపల అతడు మరింత కష్టపడి పని చేయాలని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ సూచించాడు. ఇతర బౌలర్లతో పోల్చుకుంటే బుమ్రా తన శరీరంపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తాడని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
అయితే.. దానిని ఎలా నిర్వహించాలనే విషయం అతడికి చాలా బాగా తెలుసునని చెప్పాడు. బుమ్రా మంచి వేగంతో బౌలింగ్ చేస్తాడని, అందుకనే ఫిట్‌నెస్ అందుకోవడానికి, గాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయం అతడికే బాగా తెలుసునని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ మెక్‌గ్రాత్ చెప్పాడు.
ఫిట్‌నెస్ కోసం అతడు మైదానం వెలుపల మరింత కష్టపడి పని చేయాలని సూచించాడు. ‘ఫాస్ట్ బౌలర్ అంటే కారు నడపడం లాంటిందని, ట్యాంకులో ఇంధనం అయిపోతే బండి త్వరగా ఆగిపోతుంది. నా ఫ్యూయల్ ట్యాంక్ బుమ్రా దానికంటే పెద్దదే.’ అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే బుమ్రా అంత వేగంగా తాను బౌలింగ్ చేయనన్నాడు. ఇక్కడ మెక్‌గ్రాత్ తన ఫిట్‌నెస్ గురించి చెప్పుకొచ్చాడు
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో గాయపడటానికి ముందు బుమ్రా ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయగలిగితే పరిస్థితి వేరేలా ఉండేదని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
బుమ్రా అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ అని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియాకు బుమ్రా ఎందుకు కీలకమైన ఆటగాడో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన చూపించింది. ఆ సిరీస్‌లో బుమ్రా ఆడకుంటే చాలా ఏకపక్షంగా ఉండేది. ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బౌలింగ్ చేసేంత ఫిట్‌గా ఉంటే ఏం జరిగేది చెప్పాల్సిన పని లేదు. ఇక వరుసగా ఐదు టెస్టులు ఆడడం చాలా పెద్ద విషయం. అతడిని జాగ్రత్తగా చూసుకోవాలని మెక్‌గ్రాత్ చెప్పాడు.
రీ ఎంట్రీ ఎప్పుడంటే..?
బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 2025 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏప్రిల్ తొలి లేదా రెండో వారంలో అతడు ముంబై జట్టులో చేరనున్నాడని అంటున్నారు.