ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగడంతో… 208 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 50 బంతులాడిన కోహ్లీ… ఆరు ఫోర్లు, ఆరు సిక్సులతో రెచ్చిపోయాడు. 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మవికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉన్నా.. టెన్షన్ లేకుండా నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బౌండరీల మోత మోగించారు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. అయితే… 18 పరుగులు చేసిన రిషబ్ పంత్ మిడిలార్డర్‌లో ఫరవాలేదనిపించగా, శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చాడు.
మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్ సిమన్స్‌తో కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎవిన్ లావిస్ ఫస్ట్ ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టాడు. ఫస్ట్ ఓవర్ వేసిన సుందర్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన లావిస్.. ఆ తర్వాత దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్లతో చెలరేగాడు. అయితే.. ఎట్టకేలకి అతడ్ని ఔట్ చేసిన సుందర్.. వెస్టిండీస్ జోరుకి కొద్దిగా కళ్లెం వేశాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన సిమ్రాన్ హిట్‌మెయర్.. 41 బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సులతో 56 పరుగులు చేసాడు.
లావిస్ కూడా… మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 17 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. వరుసగా సుందర్, రోహిత్ శర్మ క్యాచ్‌లు వదిలేయడంతో ఈ జోడీ మరింతగా రెచ్చిపోయింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ వరుసగా సిక్సర్లు బాదడంతో వెస్టిండీస్ 207 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.
Read More : ఉప్పల్‌లో మ్యాచ్: బౌలింగ్ ఎంచుకున్న భారత్