Hanuma Vihari Leaves Andhra Pradesh to Join Tripura for 2025-26 Ranji Season
Hanuma Vihari : టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి (Hanuma Vihari) కీలక నిర్ణయం తీసుకున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో తన సొంత రాష్ట్ర జట్టు అయిన ఆంధ్రా(Andhra Pradesh)ను వీడాడు. 2025-26 దేశవాళీ సీజన్ నుంచి త్రిపురకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కొత్త అధ్యాయం మొదలు అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విహారి వెల్లడించారు.
దేశవాళీ క్రికెట్‌లో విహారి మరో టీమ్ తరుపున ఆడేందుకు అతడికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్ఓసీని సైతం జారీ చేసింది. తన కెరీర్‌ను పునఃనిర్మించుకోవడంలో భాగంగా మూడు ఫార్మాట్లు ఆడేందుకు రంజీ ట్రోఫీలో ఎలైట్ డివిజన్‌లో ఉన్న త్రిపుర జట్టును విహారి ఎంచుకున్నాడు.
2024–25 సీజన్‌లో ఆంధ్ర తరఫున విహారి కేవలం రంజీ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడికి వన్డేల్లో, టీ20ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
New Chapter begins… pic.twitter.com/ufBxmxA8vU
— Hanuma vihari (@Hanumavihari) August 26, 2025
‘నాలో ఇంకా మూడు ఫార్మాట్లలలో ఆడే సత్తా ఉంది. అందుకనే ఇతర అవకాశాల కోసం ఎదురుచూస్తూ వచ్చాను. పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లకు ఎంచుకుంటామని ఏసీఏ చెప్పింది. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా ఆడడం అనవసరం అని భావించా. అందుకనే విజయ్ హజారే ట్రోఫీలోనూ బరిలోకి దిగలేదు.’ అని విహారి చెప్పాడు.
జట్టును వీడేందుకు ఇదే సరైన సమయం భావిస్తున్నట్లుగా భావించినట్లు తెలిపాడు. కొత్త ఛాలెంజ్‌లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. త్రిపుర తరుపున ఓ సీనియర్ ఆటగాడిగా రాణించగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
31 ఏళ్ల విహారి 2018 నుంచి 2022 మధ్యలో టీమ్ఇండియా తరుపున 16 టెస్టులు ఆడాడు. 33.6 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఐదు అర్థశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 5 వికెట్లు తీశాడు. 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 14.2 సగటుతో 284 పరుగులు చేశాడు.