Asia Cup 2025 Hardik Pandya became the second highest wicket taker for India in T20Is
Hardik Pandya : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 21న) దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టడం ద్వారా పాండ్యా (Hardik Pandya ) ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు స్పిన్నర్ చాహల్‌ను అధిగమించాడు.
79 ఇన్నింగ్స్‌ల్లో చాహల్ 96 వికెట్లు తీయగా, 106 ఇన్నింగ్స్‌ల్లో పాండ్యా 97 వికెట్లు సాధించాడు. మరో మూడు వికెట్లు తీస్తే వంద వికెట్ల క్లబ్‌లో చేరతాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 64 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 64 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 106 ఇన్నింగ్స్‌ల్లో 97 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 79 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 72 ఇన్నింగ్స్‌ల్లో 92 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 86 ఇన్నింగ్స్‌ల్లో 90 వికెట్లు
పురుషుల ఆసియాకప్ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు..
పాక్ పై వికెట్ పడగొట్టడం ద్వారా హార్దిక్ పాండ్యా పురుషుల ఆసియాకప్ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వనిందు హసరంగ, రషీద్ ఖాన్‌ల సరసన చేరాడు. వీరంతా చెరో 14 వికెట్లు పడగొట్టారు. వీరి తరువాత భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు.
ఆసియాకప్ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు..
* వనిందు హసరంగ (శ్రీలంక) – 10 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు
* హార్దిక్ పాండ్యా (భారత్) – 12 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 11 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ (భారత్) – 6 ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు
* అమ్జాద్ జావేద్ (యూఏఈ) – 7 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు
* హరిస్ రౌఫ్ (పాకిస్తాన్) – 8 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు
పాక్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన పాండ్యా 29 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 7 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ సాయంతో 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.