Harshit Rana says Team management wants to groom me as an all rounder
Harshit Rana : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఆల్‌రౌండర్లు అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తుది జట్టులో ఎక్కువగా ఆల్‌రౌండర్లకు చోటు ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే యువ పేసర్ హర్షిత్ రాణాను తన బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని జట్టు యాజమాన్యం కోరింది. ఈ విషయాన్ని హర్షిత్ స్వయంగా వెల్లడించాడు.
వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన రాణా ఆ తరువాత లక్ష్య ఛేదనలో 23 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్ తనను ఆల్ రౌండర్‌గా చూడాలని కోరుకుంటుందని చెప్పాడు. ఇక తాను కూడా నెట్స్‌లో తన బ్యాటింగ్ పై బాగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలిపాడు.
జట్టు మేనేజ్‌మెంట్ 8 స్థానంలో బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా తనను తయారు చేయాలని అనుకుంటున్నట్లు హర్షిత్ తెలిపాడు. అందుకనే తాను నెట్స్‌లో బ్యాటింగ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పాడు. లోయర్ ఆర్డర్‌లో ఆడుతూ 30 నుంచి 40 పరుగులు చేసే సామర్థ్యం తనలో ఉందన్నాడు. ఇక మేనేజ్‌మెంట్ సైతం అదే విశ్వాసాన్ని తనపై ఉంచిందన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరు తనకు మద్దతుగా నిలుస్తున్నారన్నాడు.
తొలి వన్డేలో విరాట్ ఆడుతున్నప్పుడు మరో ఐదు నుంచి ఆరు ఓవర్లు ఉండగానే మ్యాచ్ ముగుస్తుందని అనిపించినట్లు హర్షిత్ చెప్పాడు. అయితే.. మ్యాచ్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చునని, ఎవరూ ఊహించలేరని అన్నాడు.
బుమ్రా లేనప్పుడు కొత్త బంతితో వికెట్లు తీయడంలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయా అనే ప్రశ్న పై మాట్లాడుతూ.. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఆరంభంలో వికెట్లు తీయకపోయినా సిరాజ్ భాయ్ నిజంగా చాలా బాగా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో ఎక్కువగా పరుగులు ఇవ్వలేదు అని చెప్పాడు. ఇక పిచ్ నెమ్మదిగా ఉందని, బౌన్స్ కూడా పెద్దగా లేదన్నాడు.