Himanshu Sangwan
Himanshu Sangwan: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు వింటే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లుగా పేరుతెచ్చుకున్న వారుసైతం కాస్త భయపడుతుంటారు. ఎందుకంటే విరాట్ ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడంటే ఎలాంటి బాల్ నైనా తేలిగ్గా బౌండరీ లైన్ దాటించగలడు. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ను ఔట్ చేయాలనేది చాలా మంది యువ బౌలర్ల డ్రీమ్ కూడా. అయితే, ఇటీవల హిమాన్షు సాంగ్వాన్ అనే యువ బౌలర్ కళ్లుచెదిరే బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. దీంతో హిమన్షు పేరు భారత్ క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోతుంది. విరాట్ కోహ్లీని అవుట్ చేసిన తరువాత కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హిమాన్షు సాంగ్వాన్ పై మండిపడుతున్నారు. కానీ, కోహ్లీ మాత్రం అతన్ని అభినందించాడు. అంతేకాదు.. బంతిపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.
రంజీ ట్రోఫీ-2025లో భాగంగా రైల్వే స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ ఆరంభంలోనే ఒక ఫోర్ కొట్టి అభిమానులతో కేరింతలు కొట్టించాడు. కోహ్లీ దూకుడు చూసి యువ బౌలర్లకు చెమటలు పట్టాయి. అయితే, రైల్వేస్ పేసర్ హిమాన్షు సాంగ్వాన్ కళ్లుచెదిరే ఇన్ స్వింగర్ తో కోహ్లీని బోల్తా కొట్టించాడు. సాంగ్వాన్ వేసిన బంతి విరాట్ బ్యాట్ ను దాటి లోపలకు దూసుకెళ్లింది. అది తాకిన వేగానికి ఆఫ్ స్టంప్ ఎగిరి చాలా దూరంలో పడింది. దీంతో విరాట్ కోహ్లీ సైతం షాక్ కు గురయ్యాడు.
తాజాగా రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ మాట్లాడుతూ.. విరాట్ వికెట్ ఎలా తీయాలో తమ జట్టు బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడని చెబుతూ అందరినీ ఆశ్చర్యపర్చాడు. విరాట్ వికెట్ ఎలా తీయాలో బస్సు డ్రైవర్ పలు సూచనలు చేశాడట. ఐదవ స్టంప్ లైన్ లో బౌలింగ్ చేయాలని అతడు తనకు సూచించాడని, బస్సు డ్రైవర్ సూచనలకు తాను షాకయ్యానని హిమాన్షు తెలిపాడు. అయితే, కోహ్లీ బలహీనతలపై కాకుండా తన బలాలపై దృష్టిపెట్టి బౌలింగ్ చేసినట్లు వెల్లడించారు.
కళ్లు చెదిరే బంతితో స్టార్ బ్యాటర్ కోహ్లీ వికెట్ తీసిన తరువాత హిమాన్షు సాంగ్వాన్ ఎవరు..? అతడు ఎక్కడి వ్యక్తి అనే వివరాలను తెలుసుకునేందుకు నెట్టింట్లో క్రికెట్ అభిమానులు వెతకడం మొదలుపెట్టారు. అయితే, రైల్వే తరపున ఆడుతున్న ఈ పేసర్ ఢిల్లీలోని నజఫ్ గడ్ లో పుట్టిపెరిగాడు. అతని వయస్సు 29ఏళ్లు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 23 మ్యాచ్ లలో 77 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ -ఏలో 17 మ్యాచ్ లలో 21 వికెట్లు, టీ20ల్లో ఏడు మ్యాచ్ లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ గా కొంతకాలం అతడు విధులు నిర్వహించాడని తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. విరాట్ కోహ్లీని ఔట్ చేసిన తరువాత హిమాన్షు కోహ్లీని కలిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మ్యాచ్ ముగిసిన తరువాత కోహ్లీ వద్దకు నేను వెళ్లాను. బంతిపై అతడి ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాను. అప్పడు కోహ్లీ నాతో మాట్లాడుతూ.. నువ్వు అద్భుతమైన బంతిని విసిరావు అని అన్నాడు. ఆ బంతిని అతడు ఆస్వాదించినట్లు చెప్పాడు.’ అని సాంగ్వాన్ తెలిపాడు.
Virat Kohli giving his autograph to Himanshu Sangwan on the ball which wicket his took. [Lokesh Sharma]
– A beautiful gesture by Kohli 👏 pic.twitter.com/c716HqZEPX
— Johns. (@CricCrazyJohns) February 2, 2025