How Can India Qualify For Womens T20 World Cup Semi Final Despite Crushing Loss vs New Zealand
Womens T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అయితే.. టోర్నీని పేలవంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ సోఫీ డివైన్ (57; 36 బంతుల్లో 7ఫోర్లు), జార్జియా ప్లిమర్ (34; 23 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్)లు రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీసింది. ఆశ శోభన, అరుంధతి రెడ్డిలు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. 15 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో రోజ్‌మేరీ మైర్ నాలుగు వికెట్లు పడగొట్టింది. లియా తహుహు మూడు వికెట్లు తీసింది. ఈడెన్ కార్సన్ రెండు వికెట్లు పడగొట్టింది. ఇక భారత్ ఆదివారం తన తరువాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
సెమీస్ అవకాశాలు సంక్లిష్టం..
కివీస్ చేతిలో ఓడిపోవడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. గ్రూప్-ఏలో ఉన్న భారత్ తన తదుపరి మ్యాచులో పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో తలపడాల్సి ఉంటుంది. హర్మన్ సేన ఈ మూడు మ్యాచుల్లో గెలవడంతో పాటు తన రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ రన్‌రేట్ -2.900గా ఉంది.
గ్రూపు -ఏ నుంచి రెండు జట్లు మాత్రమే సెమీస్ చేరుకుంటాయి. ఆరు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ చేరుకుంటుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన ఒక్క బెర్తు కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్ పోటీ పడాల్సి ఉంటుంది.
భారత్ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా మినహా మిగిలిన అన్ని జట్లు రెండేసి మ్యాచుల చొప్పున ఓడాల్సి ఉంటుంది. ఇక్కడ రన్‌రేట్ కూడా కీలకంగా మారనుంది. ఒకవేళ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు సంచలన విజయాలు సాధిస్తే మాత్రం సమీకరణాలు వేరుగా ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే కివీస్‌తో ఓటమితో భారత సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.