వామ్మో.. ఐపీఎల్ 2025 సీజన్‌ ద్వారా బీసీసీఐ ఎంత డబ్బు సంపాదించిందో తెలుసా..?

ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వివిధ మార్గాల్లో బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది.

IPL 2025: ఐపీఎల్ -2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ -2025 సీజన్ ద్వారా బీసీసీఐ భారీగానే ఆదాయాన్ని ఆర్జించింది. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వివిధ మార్గాల్లో బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది. మీడియా హక్కులు, స్పాన్సర్ షిప్ లు, ఫ్రాంచైజీ ఫీజులు, టికెట్ల అమ్మకాలు మొదలైన వాటి ద్వారా ఆదాయం ఉంటుంది. వీటిలో అత్యంత లాభదాయకమైన వాటిల్లో ప్రసార హక్కులు ఒకటి.

టెలివిజన్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ దగ్గర ఉండగా.. డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని వయాకామ్-18 కలిగి ఉంది. ఐపీఎల్ 2025లో మొత్తం ప్రసార హక్కుల రుసుము రూ. 9678 కోట్లు, అంటే ఒక్కో మ్యాచ్ కు దాదాపు 130.7 కోట్లు.

టైటిల్ స్పాన్సర్‌షిప్ ఫీజు లెక్కల్లోకి వస్తే.. 2024లో టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను మరో ఐదు సంవత్సరాలు అంటే.. 2024 నుండి 2028 వరకు రూ. 2500 కోట్లకు దక్కించుకుంది. అంటే.. ఆ ఒప్పందంలో భాగంగా ఐపీఎల్ 2025 సీజన్ కు రూ.500 కోట్లు ఆదాయం మకూరుతుంది. దీనితోపాటు అసిసోయేట్ పార్టనర్స్ మై11 సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్ -CEAT, అధికారిక అంపైర్ పార్టనర్స్ – వండర్ సిమెంట్, ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ పార్టనర్ – అరాంకో వంటి ఇతర స్పాన్సర్ల నుండి కూడా బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది.

బీసీసీఐ ప్రతి జట్టు నుంచి సెంట్రల్, స్పాన్సర్ షిప్, టికెట్ల ఆదాయంలో 20శాతం, లైసెన్సింగ్ ఆదాయంలో 12.5శాతం పొందుతుంది. అయితే, 2024 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 2024లో బీసీసీఐకి రూ.20,686 కోట్లు ఆదాయం సమకూరగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,493 కోట్ల ఆదాయం సమకూరింది.