అతడిని చూస్తే వణికే వాడిని, దాక్కుని తినేవాడిని.. కపిల్ దేవ్‌ను భయపెట్టిన ఆ వ్యక్తి ఎవరంటే

  • Publish Date - July 16, 2020 / 01:59 PM IST

భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 1983లో భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ కెప్టెన్. భారత జట్టు నెంబర్ 1 ఆల్ రౌండర్‌గా, హరియానా హరికేన్ గా గుర్తింపు పొందిన క్రికెటర్. ఆయనే కపిల్ దేవ్. చాలామంది బౌలర్లకు తన బ్యాట్‌తో, అలాగే బ్యాట్స్‌మెన్‌కు తన బౌలింగ్‌తో భయం పుట్టించిన అలాంటి కపిల్ దేవ్ ని ఒక వ్యక్తి బాగా భయపెట్టాడట. ఆయనను చూస్తే వణికిపోయేవాడట. దాక్కుని తినేవాడట. అయితే ఆయన ఏ ప్రత్యర్థి జట్టు ఆటగాడో కాదు భారత జట్టు ఒకప్పటి కెప్టెన్ శ్రీనివాస్ వెంకటరాఘవన్. అవును, కపిల్ ను భయపెట్టిన మాజీ కెప్టెన్, శ్రీనివాస్ వెంకట్రాఘవన్. ఈ విషయాన్ని స్వయంగా కపిల్ దేవ్ చెప్పారు.

ఆయనంటే చచ్చేంత భయం:
ఓ ఇంటర్వ్యూలో కపిల్ మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలోని తన అనుభవాలు పంచుకున్నారు. ఆసక్తికర విషయాలు చెప్పారు. భారత మాజీ కెప్టెన్లలో శ్రీనివాస వెంకట్రాఘవన్ అంటే తనకు చచ్చేంత భయమని కపిల్ చెప్పారు. ‘వెంకట్రాఘవన్ అంటే నాకు చాలా భయం. దీనికి చాలా కారణాలున్నాయి. వీటిలో ఒకటి.. ఆయన ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడేవాడు. రెండోది, ఆయన కోపం. జట్టులోని అందరికీ ఆయన కోపమంటే వణుకే. అంపైర్‌గా ఉన్నప్పుడు కూడా నాటౌట్ అని వెంకట్రాఘవన్ చెప్తే.. బౌలర్‌పై అరిచినట్లే ఉండేది. ఆయన ఉంటే నేను ఓ మూలకు వెళ్లి బ్రేక్‌ ఫాస్ట్ చేసేవాడిని’ అని గుర్తు చేసుకున్నారు కపిల్ దేవ్.

ఆయనుంటే దాక్కుని తినేవాడిని, ఎందుకంటే:
1979లో నేను ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఆయనే కెప్టెన్. ఎప్పుడూ ఆయన కంటబడని సీటును వెతుక్కునేవాడిని. నాతో బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్ బాగుండేవారు. వారు కూడా ఆయనతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాములుగానే నన్ను చూసినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఇక బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెంకటరాఘవన్ కు కనబడకుండా ఓ మూలన కూర్చొని తినేవాడిని. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా తినేవాడిని. ఆయన చూస్తే ఎప్పుడూ తినడమేనా అని తిడతారని అలా చేసేవాడిని. మాములుగా టెస్టు మ్యాచ్ లో టీ బ్రేక్ ఇస్తారు. దానికి ఆయన, టీ బ్రేక్ అనే ఎందుకు అనాలి, కాఫీ బ్రేక్ అని అనకూడదా అంటూ వెంకట్రాఘవన్ వాదించేవారు’ అని కపిల్ గుర్తు చేసుకున్నారు.

కెప్టెన్ నేనా? ఆయనా? అనే సందేహం వచ్చింది:
1983 వెస్టిండీస్ పర్యటనలో తన సారథ్యంలో వెంకటరాఘవన్ ఆడారని కపిల్ తెలిపారు. ఇక ఆ టూర్‌లో బార్బడోస్ వేదికగా జరిగిన టెస్ట్‌లో ఆయన తీరు చూసి కెప్టెన్ ఎవరనే సందేహం కలిగిందన్నారు. ‘బార్బడోస్ వేదికగా జరిగిన టెస్ట్‌లో వెంకటరాఘవన్ తో జరిగిన సంఘటన నాకింకా గుర్తుంది. ఆ వికెట్ కొంచెం బౌన్సీకి సహకరిస్తుండటంతో పేసర్లను ఎక్కువగా ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను మొదట స్పిన్నర్లను బరిలోకి దింపాను. అయితే ఆఫ్ స్పిన్నర్ అయిన వెంకటరాఘవన్‌ను కాకుండా రవిశాస్త్రికి బంతినిచ్చాను. దీంతో స్లిప్‌లో ఉన్న వెంకటరాఘవన్ నా దగ్గరకు వచ్చి.. కపిల్ అని పిలిచారు. నేను.. చెప్పు వెంకీ అన్నా.(అప్పటికి వెంకీ అని సంభోదించే చనువు ఏర్పడింది. కానీ అంతకుముందు సర్ అనే పిలిచేవాడిని.) నేను ఏమన్నా బౌలింగ్ చేయను అన్నానా? అని ప్రశ్నించారు. దాంతో అసలు కెప్టెన్ ఆయనా? లేక నేనా? అనే సందేహం వచ్చింది. ‘వెంకీ నీవు బౌలింగ్ చేసే టైమ్ కూడా వస్తుంది’ అని నేను చెప్పా. అయినా ఆయన నాపై నోరుపారేసుకున్నారు. నేను కెప్టెన్ అయినా తిట్టేవారు’ అని గుర్తు చేసుకున్నారు కపిల్.

వరల్డ్ కప్ గెల్చిన అదే ఏడాదిలోనే రిటైర్మెంట్:
1960-1970లో భారత్ స్పిన్నర్‌గా రాణించిన వెంకటరాఘవన్ 57 టెస్టులు ఆడి మొత్తం 156 వికెట్లు తీసుకున్నారు. 15 వన్డేలు ఆడి 5 వికెట్లు పడగొట్టారు. కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన 1983లోనే వెంకటరాఘవన్ రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్ తర్వాత వెంకట రాఘవన్ అంపైర్‌గా కూడా సేవలందించారు.