ODI World Cup 2027 : వన్డే ప్రపంచకప్ 2027 వేదికలను ఖరారు చేసిన ఐసీసీ.. 12 స్టేడియాల్లో.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027) కోసం ఐసీసీ సన్నాహకాలు మొదలుపెట్టింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2026 / 10:07 AM IST
ICC announced ODI World Cup 2027 Venues
ODI World Cup 2027 : వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఐసీసీ సన్నాహకాలు మొదలుపెట్టింది. తాజాగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే వేదికలను ఖరారు చేసింది. ఈ మెగాటోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇస్తుండగా మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
టోర్నీలో మెజారిటీ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్నాయి. దక్షిణాఫ్రికాలో 8 స్టేడియాలను, జింబాబ్వేలోని మూడు స్టేడియాలు, నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో ఓ స్టేడియాన్ని ఐసీసీ ఎంపిక చేసింది.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను ఐసీసీ చైర్మన్ జై షా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ.. వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఓ కీలక అడుగు పడిందన్నారు. 24 సంవత్సరాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు ఈవెంట్‌ను ఓ మరుపురాని జ్ఞాపకాలుగా అందిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికాలోని ఎనిమిది వేదికలు ఇవే..
వాండరర్స్ స్టేడియం (జోహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (ట్ష్వానే), న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ (కేప్ టౌన్), కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గ్కేబెర్హా), మంగౌంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటైన్), బోలాండ్ పార్క్ (పాల్), బఫెలో పార్క్ (కుగోంపో సిటీ, గతంలో ఈస్ట్ లండన్ అని పిలిచేవారు).
జింబాబ్వేలోని మూడు వేదికలు ఇవే..
హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), కొత్తగా నిర్మించిన ఫాలే మోసి-ఓ-తున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్).
నమీబియాలోని మ్యాచ్‌లు నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్‌హోక్)లో జరుగుతాయి.
The 12 venues that will be used at next year’s @cricketworldcup have been locked in 🤩#CWC27
More 👉 https://t.co/QLxDyjmGjC pic.twitter.com/hx4LXu63HL
— ICC (@ICC) July 31, 2026
వన్డే ప్రపంచ కప్ 2027లో మొత్తం 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. 14 జట్లు పాల్గొననుండగా కొత్త ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ఆటలో పోటీ తత్వాన్ని పెంచేందుకు ఐసీసీ మూడు దశల విధానాన్ని ప్రవేశ పెట్టింది.
12 నుండి 14వ ర్యాంకులో ఉన్న జట్లతో సూపర్ సిరీస్ టోర్నీ ఆరంభం కానుంది. మూడు జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడతాయి. గెలిచిన జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది. తదుపరి దశలో 12 జట్లను ఆరేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజించి రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
రెండు గ్రూపుల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సూపర్ 7 దశకు చేరుకుంటాయి. అంతే కాకుండా రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ 7కు చేరుకుంటుంది. ఇక్కడ కూడా రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి.
కాగా.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు వాండరర్స్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
