ICC trying to convince PCB to host Champions Trophy in hybrid model Report
ICC Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ పై ఇంకా సందిగ్థత వీడడం లేదు. భద్రతా పరమైన కారణాల వల్ల పాక్‌లో ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టేది లేదని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. బీసీసీఐ నిర్ణయాన్ని ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి తెలియజేసింది.
అదే సమయంలో పాకిస్థాన్ సైతం ఐసీసీకి ఓ లేఖ రాసింది. ఛాంపియన్స్ ట్రోఫీని తమ దేశంలోనే నిర్వహించే అంశం పై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ పలు కీలక వ్యాఖ్యలను చేశాడు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఐసీసీని డిమాండ్ చేశాడు.
హైబ్రిడ్ మోడ్‌లో పీసీబీ ఈ టోర్నీని నిర్వహించేలా ఒప్పించేందుకు ఐసీసీ ప్రయత్నాలు ప్రారంభించిందని పలు రిపోర్టులు సూచిస్తున్నాయి. భారత్ లేకుండా టోర్నీని నిర్వహిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాటు కొన్ని నష్టాలు ఉంటాయని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని బ్యాక్ ఛానల్స్ ద్వారా పీసీబీని హైబ్రిడ్ మోడ్‌కు ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు కథనాలు సూచిస్తున్నాయి.
పీసీబీ హైబ్రిడ్‌కు మోడ్‌కు అంగీకరించిన వెంటనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఐసీసీ భావిస్తోంది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. 8 దేశాలు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ , న్యూజిలాండ్, సౌతాఫ్రికా దేశాలు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నీకి అర్హత సాధించడంలో శ్రీలంక విపలమైంది.