IND vs AUS 4th Test Nitish Kumar Reddy century his father emotional
ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన ఈ తెలుగు కుర్రాడు మెల్‌బోర్న్ టెస్టులో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాడు. తన టెస్టు కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ పేస్ త్రయం బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 171 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లంతా నితీష్‌కుమార్ రెడ్డికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్.. మొదటి బంతి నుంచే నిలకడగా ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై ఎనిమిదో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అనిల్ కుంబ్లే (87) పేరిట ఉండేది. ఇప్పుడు దీన్ని నితీష్ బ్రేక్ చేశాడు.
నితీష్ తండ్రి భావోద్వేగం..
ఇక నితీష్ తొలి సెంచరీ చేయడాన్ని అతడి తండ్రి ముత్యాల రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించాడు. కొడుకు శతకం చేయగానే భావోద్వేగానికి గురి అయ్యాడు. కన్నీటీ పర్యంతం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితీష్ ఆట చూసేందుకే ముత్యాల రెడ్డి వైజాగ్ నుంచి మెల్‌బోర్న్ కు వెళ్లాడు.
కొడుకు కోసం ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశాడు. కుమారుడిని క్రికెటర్‌గా మార్చేందుకు 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగాన్ని వదిలి వేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 164/5 తో ఆటను ప్రారంభించిన భారత్‌కు గట్టి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (28)తో పాటు రవీంద్ర జడేజా (17)లు తొందరగానే ఔట్ అయ్యారు. అయితే.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీష్ రెడ్డి జట్టును ఆదుకున్నాడు. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. భారత్ స్కోరు 275 పరుగుల మార్క్‌ను తాకగానే ఫాలో ఆన్ గండం తప్పింది.
Rohit Sharma: అశ్విన్ బాటలో రోహిత్..! మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్.. కీలక ప్రకటన చేసే అవకాశం
మరోవైపు సుందర్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 146 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లో నాలుగో హాఫ్ సెంచరీ. నితీష్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తరువాత నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే బుమ్రా (0) డకౌట్ కాగా సిరాజ్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు నితీష్.
ప్రస్తుతం బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి (105), మహ్మద్ సిరాజ్ (2) లు క్రీజులో ఉన్నారు. సరైన వెలుతురు రాకపోవడంతో మూడో రోజు ఆటను ఇక్కడితో ముగిసినట్లు అంఫైర్లు ప్రకటించారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
THE EMOTIONS OF NKR’S FATHER 🥹👌 pic.twitter.com/SEkRdlETZU
— Johns. (@CricCrazyJohns) December 28, 2024